
తాజా వార్తలు
ముందుకు రాని ఓటర్లు.. నెట్టింట సెటైర్లు
ఇంటర్నెట్‌డెస్క్: యావత్ దేశాన్ని ఆకర్షించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు మాత్రం మళ్లీ అదే నిర్లప్తత ప్రదర్శించారు. దిల్లీ నుంచి గల్లీ నాయకులతో ఎన్నికల ప్రచారం ఆద్యంతం జోరుగా సాగినా.. పోలింగ్ రోజు ఓటర్లు ముందుకు రాకపోవడంతో చాలా కేంద్రాలు వెలవెలబోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఉత్సాహం చూపే జనం.. సమాజం మధ్యకు వచ్చి ఓటు బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయంలో మాత్రం మిన్నకుండిపోయారు. దీంతో అదే సోషల్‌మీడియాలో ఇప్పుడు ఓటువేయని వారిపై సెటైర్లు పేలుతున్నాయి.
కొందరు కార్టూన్లు చిత్రించి వ్యంగ్యాస్త్రాలు సంధించగా.. మరికొందరు మీమ్స్‌తో చురకలు అంటించారు. ‘‘మందుషాపుల ముందు కళకళ.. ఓటింగ్ కేంద్రాలు వెలవెల’’, ‘ఐకియా ప్రారంభోత్సవానికి, తీగల వంతెనను చూడటానికి కరోనాను లెక్కచేయరుగానీ.. ఓటేసేందుకు మాత్రం కరోనా అడ్డమా’ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. పోలింగ్ కేంద్రంలో నిద్రించే సిబ్బందినే కాదు.. ఓటేయకుండా ఇంట్లో నిదురిస్తున్న పౌరుల బాధ్యతను కూడా గుర్తెరిగేట్లు చేయాలని పలువురు సూచిస్తున్నారు. మరి ఈ సెటైర్లు వేసేవారిలో ఎంతమంది ఓటేశారో తెలియదు గానీ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే..