ఇంగ్లాండ్‌ త్వరగా బాబర్‌ను ఔట్‌ చేయకపోతే..
close

తాజా వార్తలు

Published : 06/08/2020 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌ త్వరగా బాబర్‌ను ఔట్‌ చేయకపోతే..

పాక్‌ బ్యాట్స్‌మన్‌ రెచ్చిపోగలడు: మైఖేల్‌ వాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌ విజయవంతంగా క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. గతనెల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ మొదలుపెట్టగా, మొన్ననే ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ పూర్తి చేసుకుంది. ఇప్పుడు పాకిస్థాన్‌తో మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాక్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ (69; 100 బంతుల్లో 11x4) అద్భుతంగా ఆడుతూ ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించాడు. చూడముచ్చటైన షాట్లతో క్రికెట్‌ ప్రేమికుల మనసుల్ని దోచుకున్నాడు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైఖేల్‌ వాన్‌ సైతం అతడి ఆటను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్‌ జరిగాక వాన్‌ మాట్లాడుతూ బాబర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 

పాక్‌ బ్యాట్స్‌మన్‌ తొలుత కుదురుకోడానికి ఇబ్బంది పడ్డాడని, తర్వాత తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించాడని చెప్పాడు. ఈ క్రమంలో అద్భుతమైన షాట్లు ఆడాడన్నాడు. అతడి బ్యాటింగ్‌ చూస్తుంటే గతేడాది యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ (774; 4 మ్యాచ్‌ల్లో) రెచ్చిపోయినట్లు రెచ్చిపోతాడేమోనని పోల్చి చూశాడు. అలాగే టాప్‌ నలుగురు బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌, జోరూట్‌ల సరసన చేరాడని, ఇప్పటికే రూట్‌ను అధిగమించేలా ఉన్నాడని పేర్కొన్నాడు. బాబర్‌ గత 18 నెలలుగా 65 సగటుతో కొనసాగుతున్నాడని, మరే బ్యాట్స్‌మన్‌ కూడా అంతలా ఆడటం లేదన్నాడు. రోజురోజుకూ అతడు మెరుగౌతున్నాడని ఇంగ్లాండ్‌ మాజీ‌ అభిప్రాయపడ్డాడు. తమ‌ బౌలర్లు త్వరగా అతడిని ఔట్‌ చేయాలని, లేకపోతే స్మిత్‌లా చెలరేగిపోతాడని సందేహం వెలిబుచ్చాడు. మరోవైపు తొలి రోజు టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని ఆటను ప్రారంభించింది. 43 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులో కుదురుకున్న బాబర్‌, షాన్‌ మసూద్‌ (46; 152 బంతుల్లో 7x4) నిలకడగా ఆడారు. ఇంగ్లాండ్‌ బౌలర్లను కాచుకొని వీలుచిక్కినప్పుడల్లా మంచి షాట్లతో అలరించారు. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి ఆ జట్టు‌ 49 ఓవర్లలో 139/2 స్కోర్‌ చేసింది. ఇక రెండో రోజు బాబర్‌ శతకం సాధిస్తాడా లేక అంతకన్నా ముందే వెనుతిరుగుతాడా వేచి చూడాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని