మిషిగాన్‌ గవర్నర్‌ కిడ్నాప్‌కు కుట్ర!
close

తాజా వార్తలు

Published : 09/10/2020 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మిషిగాన్‌ గవర్నర్‌ కిడ్నాప్‌కు కుట్ర!

భగ్నం చేసిన ఫెడెరల్‌ అధికారులు, 13మంది అరెస్ట్‌
ట్రంప్‌పై విరుచుకుపడ్డ గవర్నర్‌ విట్మర్‌

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతోన్న సమయంలో పలు కీలక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మిషిగాన్‌ గవర్నర్‌ గ్రెట్‌చెన్‌ విట్మర్‌ను కిడ్నాప్ చేసేందుకు కుట్ర పన్నినట్లు బయటపడింది. ఈ కుట్రను ముందే పసిగట్టిన ఫెడరల్‌ అధికారులు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. అనంతరం 13మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు అమెరికా ఫెడెరల్‌ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర శాసనసభపై దాడిచేసి అధికారులపై బెదిరింపు చర్యలకు పాల్పడడం, ప్రభుత్వ వ్యతిరేక మిలిటెంట్‌ గ్రూప్‌తో సంబంధం ఉందనే అభియోగాలను వీరిపై మోపినట్లు ఫెడరల్‌ అధికారులు ప్రకటించారు.

కరోనా వైరస్‌ ఆంక్షల విషయంలో డెమొక్రాట్‌ పార్టీకి చెందిన మిషిగాన్‌ గవర్నర్‌ విట్మర్‌కు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య గతకొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మిషిగాన్‌లో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు కుట్రపన్నారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చివరకు గవర్నర్‌ను అతిథి గృహంలో కిడ్నాప్‌ చేయాలని ప్రణాళికను కూడా సిద్ధం చేశారని అన్నారు. ఇందుకోసం దాదాపు 200మందిని నియమించుకునేందుకు సిద్ధమైనట్లు మిషిగాన్‌ అటార్నీ జనరల్‌ డానా నాస్సెల్‌ ప్రకటించారు. ‘ప్రస్తుతం కస్టడీలో ఉన్న అనుమానితులు మిషిగాన్‌ అధికారుల ఇళ్లను గుర్తించి వారిని భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేశారు. చివరకు మిషిగాన్‌ చట్టసభపై దాడిచేసి గవర్నర్‌నే కిడ్నాప్‌ చేసేందుకు కుట్ర పన్నారు’ అని నాస్సెల్‌ మీడియాకు వెల్లడించారు.

ట్రంప్‌పై విరుచుకుపడ్డ విట్మర్‌..

డెమొక్రాట్‌కు చెందిన మిషిగాన్‌ గవర్నర్‌ సమయం దొరికినప్పుడల్లా అధ్యక్షుడు ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతోన్న సమయంలో ఇది మరింత పెరిగింది. అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగాలతో ద్వేషాన్ని, రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారని గవర్నర్‌ విట్మర్‌ ఆరోపించారు. అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో జరిగిన చర్చను ఉదహరించిన ఆమె, హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే ఇటువంటి అరాచకవాదులను ఖండించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ నిరాకరించారని అన్నారు. ఉన్నత పదవిలో ఉన్న నాయకులు ఇలాంటివి ప్రోత్సహించినప్పుడే కొందరు తీవ్రభావజాలం కలిగిన వాళ్లు ఇటువంటి చర్యలకు పాల్పడుతారని తనపై జరిగిన కిడ్నాప్‌ కుట్రను విట్మర్‌ ఉదహరించారు.

ఆమె వ్యాఖ్యలకు ట్రంప్‌ కూడా జవాబిచ్చారు. ‘తమ ప్రభుత్వ న్యాయవిభాగంతోపాటు ఫెడరల్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మిషిగాన్‌ గవర్నర్‌ కుట్రను విఫలం చేశారు. దీంతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి నిందిస్తున్నారు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని