
తాజా వార్తలు
ఫ్రస్ట్రేషన్‌లోకి భాజపా: హరీశ్‌రావు
హైదరాబాద్: నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల సంఘం కార్యాలయం ముందు భాజపా ధర్నా డ్రామా అని ఆయన అభివర్ణించారు. పటాన్చెరులో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం భాజపా తరఫున 12 మంది కేంద్రమంత్రులు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానిని కూడా తీసుకొచ్చారన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా ఎన్నికల ప్రచారం ఉండాలని.. కానీ భాజపా దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. సోషల్ మీడియాను ఫేక్మీడియాగా భాజపా మార్చిందని.. దాన్ని నడపడంలో ఆ పార్టీకి నోబెల్ బహుమతి వస్తుందని ఎద్దేవా చేశారు.
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నట్లు ఓ ఛానల్ లోగోతో తప్పుడు వీడియో స్పష్టించారని.. ఇప్పుడు తనతో పాటు తెరాస కీలక నేతలు పార్టీ మారుతున్నట్లు ప్రముఖ ఛానళ్ల నకిలీ లోగోలతో వీడియో తయారు చేయించారని హరీశ్ ఆరోపించారు. భాజపా ఫ్రస్టేషన్లోకి వెళ్లిందని.. దాడులకు పాల్పడే అవకాశముందన్నారు. తెరాస శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.