
తాజా వార్తలు
ఇన్వర్టర్లు పోయి.. ఇన్వెస్టర్లు వచ్చారు: కేటీఆర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలిస్తేనే హైదరాబాద్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. నోటికొచ్చిన హామీలిస్తూ భాజపా నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు రాల్చుకోవాలని కుట్ర చేస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెచ్చి.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. ఆ పని చేశారా? అని ప్రశ్నించారు. ఒక వేళ మీ ఖాతాల్లో రూ.15 లక్షలు పడితే భాజపాకే ఓటేయండి.. లేదంటే తెరాసకు ఓటేయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘‘కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. ఇవాళ రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వస్తున్నారు. కేసీఆర్ రాకముందు.. వచ్చాక.. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బేరీజు వేసి పరిశీలించండి. ఆరేళ్లలో హైదరాబాద్లో ఎలాంటి అల్లర్లు లేవు. రౌడీ షీటర్లు లేరు.. గుండాలు లేరు. వరదలు వచ్చినప్పుడు దిల్లీ నేతలు ఒక్కరు కూడా హైదరాబాద్ రాలేదు. సాయం అడిగినా అందించలేదు. వర్షాలు, వరదలతో హైదరాబాదీలు తల్లడిల్లుతుంటే వారిని ఆదుకున్నది తెరాస ప్రభుత్వమే. వరదల సమయంలో రానివారు ఎన్నికలు అనేసరికి దిల్లీ నుంచి వచ్చారు. కానీ ఇక్కడ కేసీఆర్ ఒక్కడే. వరద సాయం అందనివారికి డిసెంబర్ 7 తర్వాత ఇస్తాం’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.