close

తాజా వార్తలు

Updated : 24/11/2020 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపాకు విషం తప్ప విషయం లేదు:కేటీఆర్‌

హైదరాబాద్‌: మతంపేరిట రాజకీయాలు చేసే వాళ్ల మాయలో ప్రజలు పడొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆరేళ్లలో కేంద్రానికి రూ.2.70లక్షల కోట్లు పన్నుల రూపంలో కడితే రూ.1.40లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారన్నారు. తమ డబ్బునే వారణా, పట్నాకు తరలిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌లోని గాంధీనగర్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో భాజపా, ఎంఐఎం ఇద్దర్నీ కలిపి కొడతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం 1920లో గండిపేట కట్టారని.. వందేళ్లలో మళ్లీ అలాంటి సౌకర్యం కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలు చేయలేదన్నారు. అందుకే కేశవాపూర్‌ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నామని.. ఏడాదిలో దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

కేసీఆర్‌ లేఖ రాస్తే ఉలుకూ పలుకూ లేదు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా సీనియర్‌ నేత లక్ష్మణ్‌ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. వరదలొస్తే కర్ణాటక, గుజరాత్‌కు నిధులిచ్చారని.. హైదరాబాద్‌ గురించి సీఎం కేసీఆర్‌ ప్రధానికి లేఖ రాస్తే ఉలుకూపలుకూ లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వరదసాయాన్నీ నిలిపేశారని ఆరోపించారు. రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25వేలు ఇస్తారా? అని ప్రశ్నించారు. వరద బాధితుల జాబితా ఇస్తానని.. మోదీని ఒప్పించి రూ.25వేలు ఇప్పించాలని భాజపా నేతలకు కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 4 తర్వాత మిగిలిన బాధితులందరికీ వరదసాయం అందిస్తామని స్పష్టం చేశారు. దిల్లీ నుంచి టూరిస్టులు వస్తారు పోతారని.. తెరాస మాత్రమే పక్కాలోకల్‌ అని వ్యాఖ్యానించారు. 

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లే బాకీ

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఒక్కటే బాకీ ఉన్నామని.. ఇన్ని చేసినోళ్లం అవి ఇవ్వమా? కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘భాజపాను గెలిపిస్తే హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారంట! హైదరాబాద్‌ ఎక్కడుంది? ఇదేమైనా పాకిస్థాన్‌లో ఉందా?’’ అని నిలదీశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. భాజపాకు విషం తప్ప విషయం లేదన్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటేనే సంస్థలు వచ్చి యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని