
తాజా వార్తలు
ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచాలి: కేటీఆర్
మహబూబ్‌నగర్: ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాల భవనాన్ని మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన వల్లే 5 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లోనే కోట్ల మందికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ఇంకా నమ్మకం పెంచాల్సిన అవసరముందన్నారు. ‘‘ కరోనాకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు భయపడుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా బాధితుడి వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కానీ, ప్రభుత్వ వైద్యులు మాత్రం భయపడకుండా చేర్చుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి ప్రభుత్వ వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.
చిన్న చిన్న పొరపాట్లను పెద్దదిగా చూపించి ప్రజలను భయపెట్టొద్దని పాత్రికేయులను కేటీఆర్ కోరారు. కోరోనా బాధితులను వెలివేసినట్లు చూడటం సరికాదన్నారు.కరోనాకు పేద, ధనిక అనే తేడాలు లేవని, ఎవరికైనా రావొచ్చని అన్నారు. కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా నివారణ కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం కాదని, కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదైనా ఉంటే విపక్షాలు చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ కరోనా కేసుల్లో దేశం మూడోస్థానంలో ఉంది. అలాంటప్పుడు దీన్ని ప్రధాని వైఫల్యంగా భావించాలా? అని ప్రశ్నించారు. 2 శాతం మరణాలను చూపించి.. 98 శాతం రికవరీని చిన్నదిగా చూపొద్దని కోరారు. ఫార్మా పరిశ్రమ పట్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని, భారత్‌లో తయారైన మందులు ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయన్న విషయం గుర్తించాలని కేటీఆర్ కోరారు. విపక్షాలు నిర్మాణాత్మక సూచలను చేస్తే స్వీకరిస్తామని, అనవసర విమర్శలు చేసి వైద్య సిబ్బంది స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని అన్నారు.
అంతకుముందు మంత్రి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై పూర్తి విశ్వాసముందని, త్వరలోనే మహబూబ్‌నగర్‌లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. దాదాపు 200 మంది వైద్య సిబ్బందితో ప్రజలకు వైద్యసేవలు అందుతాయని భరోసా ఇచ్చారు. గత ఆరేళ్లలో మహమూబ్‌నగర్ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌అన్నారు. సీఎం కేసీఆర్‌కు అడిగిన వెంటనే జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేశారన్నారు. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా హైదారాబాద్‌కు వెళ్లేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పెద్ద ఆస్పత్రి నిర్మించుకున్నామని అన్నారు. మూడేళ్లలోనే
వైద్య కళాశాలలకు పీజీ వైద్య సీట్లు కూడా కేటాయించారన్నారు.