close

తాజా వార్తలు

సినిమా సొసైటీతో మ్యాచ్‌ అవ్వాలి

‘మిస్‌ మ్యాచ్‌’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌: ‘‘సినిమాలు స్త్రీల గౌరవం పెంచేలా ఉండాలి. సమాజంలో బాధ్యత, విలువలు తేలియజెప్పేలా ఉండాలి. అప్పుడే సినిమా సొసైటీతో మ్యాచ్ అవుతుంది. సమాజానికి మంచి చేస్తుంది. ‘మిస్ మ్యాచ్’ కూడా సొసైటీకి మ్యాచ్ కావాలి ఆశిస్తున్నా’’ అన్నారు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు. ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. నిర్మల్‌కుమార్‌ దర్శకుడు. శ్రీరామరాజు, భరత్‌రామ్‌ నిర్మాతలు. గిఫ్టన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ముందస్తు  విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, ప్రముఖ నటుడు వెంకటేశ్‌, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, నటుడు శ్రీవిష్ణు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో హత్యాచారానికి గురైన దిశకు సంఘీభావంగా వేదికపై అతిథులు, చిత్రబృందం మౌనం పాటించింది. 

హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు సినిమా రంగంలో కొత్త తరం హవా నడుస్తోంది. కొత్త కథలతో కొత్త కొత్త ఆలోచనలతో నూతన దర్శకులు, నటీనటులు వస్తున్నారు. అద్భుతమైన విజయం అందుకుంటున్నారు. అలాగే ‘మిస్‌ మ్యాచ్‌’ కూడా అదే స్థాయిలో విజయం సాధించాలి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన సినిమా ఇది. ఒక యువకుడు తన ప్రేమికురాలి విజయం కోసం పడిన తపనను చూపిన ఒక చక్కటి సందేశాత్మక చిత్రం. ప్రేమ అనేది మనిషి సామర్ధ్యం పెంచాలి. ఒక విజయం వైపు నడిపించాలి. పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండాలి. నిజ జీవితంలో ఉదయ్ కుమార్ 15వ ఏటలోనే గిన్నిస్‌ రికార్డు సాధించారు. రెండో సినిమానే అయినా చక్కగా నటించారు’’ అన్నారు.

వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘మొదటి సినిమా ‘అటగదరా శివ’తోనే తనేంటో నిరూపించుకున్నాడు ఉదయ్‌. 15 ఏళ్లలో గిన్నిస్‌ బుక్‌ ఎక్కడం సాధారణ విషయం కాదు. ఐశ్వర్య తెలుగులో రెండో సినిమా చేస్తోంది. ఈ సినిమా కోసం రెజ్లింగ్‌లో ఎంతో కష్టపడింది. ‘రాజా’, ‘సూర్యవంశం’ సినిమాల్లా ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి. ‘డాక్టర్‌ సలీమ్‌’తో దర్శకుడిగా నిర్మల్‌ నిరూపించుకున్నాడు. డిసెంబర్‌ 6న విడుదల కానున్న ఈ చిత్రం మరింత విజయం సాధించాలి’’ అన్నారు.

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘విత్తనం ఒకటైతే చెట్టు ఒకటవుతుందా అన్నట్లు ఉదయ్‌శంకర్‌ చిన్నతనంలోనే గిన్నిస్‌ బుక్‌ ఎక్కాడు. ‘ఆటగదరా శివ’తో శివుడి కటాక్షం పొందాడు. ఉదయ్‌ గురించి వెంకటేశ్‌, పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌, సురేందర్‌ రెడ్డి చెప్పారు. ఆ నలుగురు పిల్లర్స్‌ చెప్పిన తర్వాత ఈ బిల్డింగ్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఐశ్వర్య రాజేశ్‌ వాళ్ల అమ్మ నాగమణి నాతో ‘అడవి రాముడు’తో మొదలై 50-60 సినిమాలు చేసింది.  ఆమె చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఆమె తనయగా వచ్చిన ఐశ్వర్య తొలి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’తో సిక్సర్‌ కొట్టింది. ఈ బాక్సింగ్‌ సినిమా (మిస్‌ మ్యాచ్‌)తో బాక్స్‌ బద్ధలవుతుంది. నిర్మల్‌కుమార్‌ తొలి సినిమా ‘సలీమ్‌’ అదరగొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాని మరింత చక్కగా తీసుంటాడని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.  దిశ హత్యోదంతం గురించి రాఘవేంద్ర రావు ప్రస్తావిస్తూ... ఐశ్వర్య లాంటి అమ్మాయిలు ఇలాంటి సందర్భాల్లో స్పందిస్తే ఆ విషయంలో మరింతగా ప్రజల్లోకి వెళ్లి చైతన్యం వస్తుందని సూచించారు. 

ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ ప్రారంభం నుంచి ఈ సినిమాతోనే ప్రయాణం చేస్తున్నాను. ఈ సినిమాలోనూ పాటలు రాయాల్సి ఉన్నప్పటికీ... వీలవలేదు. అయినా నేను ఈ సినిమాతో ఉండాలనే ఆలోచనతో ‘తొలిప్రేమ’లో నేను రాసిన ‘ఈ మనసే...’ పాటను ఇందులో పెట్టారు. నిర్మల్‌ కుమార్‌కు తెలుగు పరిశ్రమ తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సినిమాతో తెలుగులో నటిస్తున్న తెలుగు అమ్మాయికి మంచి విజయం దక్కాలని ఆకాంక్షిస్తున్నాను. ‘ఆటగదరా శివ’లో ఉదయ్‌ శంకర్‌ నటనకు మంచి పేరొచ్చింది. ఈ సినిమా అంతకుమించి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. 
దర్శకుడు నిర్మల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘నా తొలి తెలుగు సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సినిమా వెంకటేశ్‌తో చేయాల్సి ఉంది. తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా. ఈ సినిమాలో ‘ఓ మనసే’ పాటను సింగిల్‌ టేక్‌లో చేశారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’లో ఐశ్వర్యను చూశారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె నిజంగా క్రీడల్లోకి వెళ్లొచ్చు. కథానాయకుడు ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ‘‘పవన్‌ కల్యాణ్‌ చేసిన ‘ఈ మనసే’ పాటను సింగిల్‌ షాట్‌లో తీశాం. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ ఆలోచన అది. గ్లామర్‌, నటనలో రెండింట్లోనూ రాణించగలరని ఐశ్యర్యను ఎంచుకున్నాం. ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు’’ అని అన్నారు. ఐశ్యర్య రాజేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. వెంకటేశ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌. ఆయన నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ కనీసం 50 సార్లు చూసుంటా. అలాంటి వ్యక్తి ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

దర్శకుడు చంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ ‘‘మామూలుగా ఎవరైనా హీరో కావాలనుకునేవాళ్లు.. అందమైన కాస్ట్యూమ్స్‌, రిచ్‌ లుక్‌, ఛేజ్‌లు, ఫైట్లు లాంటివి ఉండాలని కోరుకుంటారు. అవన్నీ లేని మా ‘ఆటగదరా శివ’ సినిమాను ఉదయ్‌ చేయడం నాకే విచిత్రంగా అనిపించింది. అలాంటి కోరికను ఈ సినిమాలో తీర్చుకున్నాడని అనిపిస్తోంది. ఉదయ్‌శంకర్‌ ఏ సినిమా చేసినా, ఎన్ని సినిమాలు చేసినా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. దర్శకుడు డాలీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గురించి కొన్ని నెలల క్రితం తెలిసింది. దీనికి సరైన హీరో, దర్శకుడు పడితే మంచి విజయం సాధిస్తుందని అనుకున్నాను. అలాంటప్పుడు నిర్మల్‌ కుమార్‌ చేస్తున్నారని తెలిసింది. ఆ తర్వాత ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్య రాజేశ్‌ కలసి నటిస్తున్నారని తెలిసింది. దీంతో ఈ సినిమాకు సరైన టీమ్‌ దొరికిందని అనుకున్నాను. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు. కథానాయకుడు శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘ఉదయ్‌ శంకర్‌ను ఇంతకుముందు ఓసారి కలిశాను. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సినిమాని 72 సార్లు థియేటర్‌లో చూశాను. ప్రతిసారి ఒక్కడ్నే వెళ్తే బాగుండదని ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లేవాడిని. విజయవాడలో అప్సర థియేటర్‌లో ఎన్నిసార్లు చూస్తాంలే అని గుంటూరు వచ్చాను. అప్పుడే ఉదయ్‌ని చూశాను. ఉదయ్‌ రికార్డుల గురించి కూడా తెలిసింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు ‘మిస్‌ మ్యాచ్‌’ సినిమా సందర్భంగా కలవగలిగాను’’ అని చెప్పాడు. రచయిత దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘ఒక ప్రేయసి విజయం కోసం వెనుక ప్రియుడు పరితపించడం అనే కథతో ‘మిస్‌మ్యాచ్‌’ ను తెరకెక్కించారు. ఇలాంటి మంచి విషయాలతో సినిమాలు వస్తే సమాజంలో రైట్‌ మ్యాచ్‌ అవుతాయి’’ అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.