60 ఏళ్లలో కానిది ఆరేళ్లలో చేశాం: నడ్డా
close

తాజా వార్తలు

Published : 31/05/2020 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60 ఏళ్లలో కానిది ఆరేళ్లలో చేశాం: నడ్డా

దిల్లీ: ప్రతిపక్షాలు 60 ఏళ్ల పాలనలో చేయలేని పనులను ప్రధానిగా మోదీ ఆరేళ్లలో సుసాధ్యం చేశారని భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. మోదీ రెండో దఫా ఏడాది పాలన విజయాలకు చిరునామాగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఏళ్లుగా మిగిలిపోయిన సవాళ్లకు సాహోసేపతమైన నిర్ణయాలతో పరిష్కరించారన్నారు. మోదీ సర్కార్‌ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించడంలో మోదీ ముందుండి దేశాన్ని నడిపిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. అనేక శక్తిమంతమైన దేశాలు సైతం మహమ్మారిని నియంత్రించలేకపోయాయని.. భారత్‌లో మాత్రం వ్యాప్తి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. సరైన సమయంలో లాక్‌డౌన్ విధించి కరోనా మెడలు వంచారంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు.

పౌరసత్వ సవరణ చట్టం, అధికరణ 370, ఉగ్రవాద నిరోధక చట్టాల్ని పటిష్ఠం చేయడం, బ్యాంకుల విలీనాలు మోదీ సాధించిన విజయాలకు ఉదాహరణలని నడ్డా అభిప్రాయపడ్డారు. ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు దేశాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ఉపయోగపడ్డాయన్నారు.

ఈ సందర్భంగా నడ్డా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అయోధ్య వంటి వివాదాలను సుదీర్ఘ కాలం పరిష్కారం కాకుండా కాంగ్రెస్‌ జాప్యం చేసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వీలైనంత త్వరగా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా డిజిటల్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్లు నడ్డా తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని