
తాజా వార్తలు
పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే.. !
బ్రిటిష్ పరిశోధనలో వెల్లడి
దిల్లీ: కొవిడ్-19 మహమ్మారి ప్రభావం చిన్నారులు, పెద్దవారిపై భిన్నంగా ఉంటుందని వివిధ పరిశోధనల్లో ఇప్పటికే తేలింది. అయితే, ఇందుకు గల కారణం లండన్‌కు చెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ తాజా పరిశోధనలో వెల్లడైంది. కరోనా వైరస్ పెద్దవారి కంటే పిల్లల్లో తక్కువగా సోకడానికి గల కారణాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు 300 మంది పెద్దవారు, 48 మంది పిల్లలపై పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో 43 శాతం పిల్లల్లో కరోనా యాంటీబాడీలు ఉండగా.. పెద్దవారిలో కేవలం 5 శాతం ఉన్నాయని వారు వెల్లడించారు.
యాంటీబాడీలు ఇలా లభించాయి..
పెద్దవారితో పోలిస్తే పిల్లల్లోనే కరోనా వైరస్‌ను తట్టుకునే శక్తి అధికంగా ఉన్నట్టు పరిశోధకులు వివరించారు. కొవిడ్-19 విధ్వంసక ప్రభావాన్ని పరిశీలించేందుకు నిర్వహించిన ఈ పరిశోధనలో.. ఈ వైరస్ పట్ల చిన్నారుల వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందించే తీరు విభిన్నంగా ఉన్నట్లు వెల్లడైంది. జలుబు తదితర సాధారణ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వారికి లభించిన యాంటీబాడీల వల్ల.. కరోనాను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం వీరికి లభించిందని పరిశోధకులు కనిపెట్టారు.
నిజానికి శ్వాస సంబంధ వ్యాధులు సోకే ప్రమాదం పిల్లల్లోనే అధికం అయినప్పటికీ.. పై కారణం వల్ల వారికి కరోనా సోకినా అది సాధారణ ప్రభావమే చూపుతుందని వారు వివరించారు. తమ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్ళే దిశగా ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు.