‘మార్క్‌’ 4ను ముకేశ్‌ దాటేస్తారా?

తాజా వార్తలు

Published : 27/07/2020 10:34 IST

‘మార్క్‌’ 4ను ముకేశ్‌ దాటేస్తారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద విలువ దూసుకెళుతోంది. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌10 కూడా లేని ఆయన ఇప్పుడు ఏకంగా టాప్‌-5లోకి దూసుకొచ్చారు. ఇటీవలే తొలిసారి టాప్‌-10లో చోటు సంపాదించిన ఆయన.. రెండు వారాల వ్యవధిలోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల విలువ పెరగడం, జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో ఇదే దూకుడు కొనసాగితే నాలుగో స్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ ను దాటడానికి సమయం పట్టకపోవచ్చు!

ఎవరు ఏ స్థానంలో? 

ప్రపంచ కుబేరుల జాబితాలో గత కొన్నేళ్లుగా అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌దే అగ్రస్థానం. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను వెనక్కు నెట్టేసి కొన్నేళ్లుగా ఆ స్థానంలో కొనసాగుతున్నారు. వాస్తవానికి 2018 నాటికే బెజోస్‌ నికర సంపద 167.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఆయన భార్య మెకంజీ బెజోస్‌కు విడాకులు ఇవ్వడంతో ఆయన వ్యక్తిగత సంపద కొంత తగ్గింది. అయినప్పటికీ  178.6 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద 113.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 112.1 బిలియన్‌ డాలర్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నారు. ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ 85.0 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఆర్నాల్డ్‌ను మినహాయిస్తే తొలి నాలుగు స్థానాలను అమెరికన్లే ఆక్రమించడం గమనార్హం. ఎప్పుడూ అమెరికా, ఐరోపాకే దేశాలకు చెందిన వారి పేర్లే కుబేరుల జాబితాలో ఎక్కువగా కనిపిస్తుండగా.. తొలిసారి టాప్‌-5 జాబితాలో ముకేశ్‌ కారణంగా భారత్‌ పేరు తెరపైకి వచ్చింది. వారెన్‌ బఫెట్‌, లారీ ఎల్లిసన్‌, స్టీవ్‌ బాల్మెర్‌, లారీ పేజ్‌, ఎలాన్‌ మస్క్‌ టాప్‌-10లో కొనసాగుతున్నారు.

(నోట్‌: జులై 26వ తేదీ నాటికి ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్‌ జాబితా ప్రకారం..)

ముకేశ్‌ ఎక్కడి నుంచి ఎక్కడకు?

ప్రపంచ కుబేరుల జాబితాలో ఈ ఏడాదిలోనే ముకేశ్‌ 9 స్థానాలు ఎగబాకారు. రెండు వారాల క్రితం గత నెల తొలిసారి ఆయన టాప్‌-10 జాబితాలో ప్రవేశించారు. వారం క్రితమే బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈవో వారెన్‌ బఫెట్‌ను అధిగమించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 23 బిలియన్‌ డాలర్లకు పైగా సంపాదనతో ఇది సాధ్యమైంది. ముఖ్యంగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌, గూగుల్‌, సిల్వర్‌ లేక్‌, క్వాల్‌కామ్‌ వంటి అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, రైట్స్‌ ఇష్యూ చేయడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లు దూసుకెళ్లాయి. గత మూడు నెలల్లో ఆ కంపెనీ షేరు విలువ భారీగా పెరిగింది. కరోనా సంక్షోభంతో మార్చిలో కంపెనీ షేర్లు రూ.1,000 లోపునకే పడిపోయినప్పటికీ మళ్లీ పుంజుకున్నాయి. అప్పట్లో నమోదైన కనిష్టాలతో పోలిస్తే 145 శాతం పెరగడం గమనార్హం. జులై ఒకటో తేదీన ఆర్‌ఐఎల్‌ షేరు రూ.1737.60 ఉండగా.. 24వ తేదీకి దాని విలువ రూ.2146.15కి పెరిగింది. 14.51 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ సాధించిన కంపెనీగా అవతరించింది.

‘4’ వైపుగా..

కుబేరుల జాబితాలో టాప్‌-10 నుంచి టాప్‌-5లోకి వచ్చిన ముకేశ్‌కు నాలుగో స్థానాన్ని చేరుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు జియో ప్లాట్‌ఫామ్స్‌పై పెద్దఎత్తున పెట్టుబడి పెట్టగా.. మరో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా రిలయన్స్‌ రిటైల్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 9.9 శాతం వాటాల కొనుగోలు చేయవచ్చన్నది వీటి సారాశం. మరోవైపు కరోనా కారణంగా దేశంలో డేటా వినియోగం భారీగా పెరిగింది. దీనిపై రిలయన్స్‌ మరింత దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు పలు కీలక ప్రకటనలు చేసింది. వచ్చే ఏడాది కల్లా 5జీని సిద్ధం చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించింది. అందుబాటు ధరల్లో 4జీ-5జీ స్మార్ట్‌ఫోన్లు, వర్చువల్‌ సమావేశాల కోసం జియో గ్లాస్‌,  జియో టీవీ+ అంటూ పలు కొత్త ఉత్పత్తులపై ప్రకటనలు కూడా చేసింది. రిటైల్‌ వ్యాపారానికి సంబంధించి జియో మార్ట్‌ను కూడా ప్రారంభించింది. రిటైల్‌ వ్యాపారంలోకి మరి కొన్నాళ్ల పాటు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని ప్రకటన చేసింది. అయితే, కరోనా సంక్షోభం వేళ రిలయన్స్‌ చమురు- రసాయనాల వ్యాపారం కొంత క్షీణించింది. మరోపక్క  కొన్ని సాంకేతిక అడ్డంకులతో సౌదీ ఆరామ్‌కోకు 20 శాతం వాటాల విక్రయానికి సంబంధించని ఒప్పందంపై ముందు అడుగు పడలేదు. ఇటీవల ఏజీఎంలో ఇదే విషయాన్ని ప్రకటించగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు క్షీణించడం గమనార్హం. పెట్రో, కెమికల్‌ వ్యాపారం మళ్లీ కుదుట పడి, మిగిలిన వ్యాపారం కూడా సజావుగా సాగి, మరిన్ని పెట్టుబడులు రిలయన్స్‌ విభాగాల్లోకి వస్తే నాలుగో స్థానం కొన్ని వారాల్లోనే సాధ్యం కానుంది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని