ముంబయికి ‘నిసర్గ’ ముప్పు!
close

తాజా వార్తలు

Published : 03/06/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయికి ‘నిసర్గ’ ముప్పు!

రేపు మధ్యాహ్నం తీరం దాటనున్న తుపాను
గంటకు 100 కి.మీ.పైగా వేగంతో వీయనున్న గాలులు
తీరంలో 144 సెక్షన్‌

ముంబయి: ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిపైకి తుపాను రూపంలో మరో ముప్పు దాడికి సిద్ధమైంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను వేగంగా దూసుకొస్తోంది. రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ మధ్య హరిహరేశ్వర్‌, దామన్‌ మధ్య బుధవారం మధ్యాహ్నం ఇది తీరం దాటనుందని వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 120 కి.మీ వేగం వరకు వీచే అవకాశాలూ లేకపోలేదని హెచ్చరించింది. రాయగఢ్‌ జిల్లాలో ఉన్న హరిహరేశ్వర్‌ ముంబయికి 190 కి.మీ దూరంలో ఉండగా.. దామన్‌ ముంబయికి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సీఎంలకు మోదీ ఫోన్‌

నిసర్గ తుపాను నేపథ్యంలో ప్రధాని మోదీ మహారాష్ట్ర, గుజరాత్‌ ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని తెలిపారు. అలాగే డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీ అధికారులతోనూ మాట్లాడారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు సిద్ధం

తుపాను నేపథ్యంలో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు మోహరించాయి. మొత్తం 16 బృందాలు రంగంలోకి దిగినట్లు సీఎం ఉద్ధవ్‌ కార్యాలయం వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ముంబయి నగరంతో పాటు తీరం ప్రాంతం కలిగి ఉన్న థానే, పాల్ఘర్‌, రాయగడ్‌, రత్నగిరి, సింద్‌ధుర్ఘ్‌ జిల్లాలకు అలెర్ట్‌ జారీ చేశారు.

తీరంలో 144 సెక్షన్‌

ముంబయి తీరంలో 144 సెక్షన్‌ విధించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఎవరైనా ఒకరి కంటే ఎక్కువ మంది బీచ్‌, పార్కుల వద్ద, పబ్లిక్‌ ప్రాంతాల్లో కనిపించినా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని