close

తాజా వార్తలు

Published : 15/07/2020 02:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.3 వేల కోసం హత్య

మహిళను కిరాతకంగా హతమార్చిన ఆటో డ్రైవర్‌

48 గంటల్లో కేసును ఛేదించిన ఏలూరు పోలీసులు

ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: కేవలం రూ.3 వేలు అప్పు తీసుకున్న మహిళ.. ఆ సొమ్మును తిరిగి ఇవ్వలేదని కక్ష గట్టిన ఓ ఆటో డ్రైవర్‌ ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాల్వగట్టు పొదల్లో వదిలేశాడు. ఈ ఘటన జరిగిన పది రోజులకు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు కేసు ఛేదన చిక్కుముడిగా మారింది. కారణం మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేనంతగా తయారవ్వడమే. కేసును ఓ సవాలుగా స్వీకరించిన ఏలూరు గ్రామీణ సీఐ అనసూరి శ్రీనివాసరావు తనదైన శైలిలో దర్యాప్తును ప్రారంభించి ఎట్టకేలకు నిందితుడిని కేసు నమోదు చేసిన 48 గంటల్లో అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కేవలం రూ.3 వేలు తిరిగి ఇవ్వనందుకు నిండుప్రాణాన్ని బలి తీసుకున్న నిందితుడిని కటకటాల వెనక్కు నెట్టారు. ఏలూరు గ్రామీణ పొలీసుస్టేషన్‌ వద్ద ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఒ.దిలీప్‌కిరణ్‌ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 7న సాయంత్రం పెదవేగి మండలం మొండూరు సమీపంలోని పోలవరం కుడి కాలువ గట్టు కింద ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. 30 ఏళ్ల మహిళ మృతదేహం బాగా కుళ్లిపోవడంతో ఆమెను గుర్తించడం సాధ్యం కాలేదు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన ఏలూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ సీఐ అనసూరి శ్రీనివాసరావు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ ఆదేశాల మేరకు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతదేహం వద్ద నిందితుడి ఆధారాలేమీ లభించకపోవడంతో కేసు ఛేదన కష్టంగా మారినా చాకచక్యంగా మృతురాలి వివరాలు తెలుసుకున్నారు. దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడేనికి చెందిన జానపూడి అనూష(30)గా ఆమెను గుర్తించారు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త గతంలోనే చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు దెందులూరు మండలం నాగులదేవిపాడుకు చెందిన గుజ్జుల సందీప్‌ పరిచయమయ్యాడు. అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరూ అప్పుడప్పుడూ కలుసుకునే వారు. ఈ విధంగా వివాహేతర సంబంధం నెరిపారు. అనూషకు రూ.3 వేలు అవసరం కావడంతో సందీప్‌ తాను ఆటో కిస్తీ కట్టే డబ్బులు ఆమెకు అప్పుగా ఇచ్చాడు. వారం రోజుల్లో బాకీ చెల్లిస్తానని అనూష చెప్పింది. ఆ తర్వాత డబ్బులు అడిగినా ఆమె ఇవ్వకుండా ఏవో సాకులు చెబుతుండేది. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటిన మధ్యాహ్నం అనూష పెదవేగి మండలం 7వ మైలురాయి వద్దకు రమ్మని చెప్పింది. కాసేపటికి సందీప్‌ ఆటో వేసుకుని అక్కడకు వెళ్లి ఆమెను ఎక్కించుకున్నాడు. మొండూరు వద్ద పోలవరం కుడికాల్వ గ్రావెల్‌ రోడ్డులోకి వెళ్లాక ఆటోను నిలిపాడు. అనంతరం డబ్బుల విషయం అడగ్గా అనూష ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే సందీప్‌ కోపంతో ఆమెను గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత చున్నీతోనే ఊపిరి ఆడకుండా చేయడంతో ఆమె చనిపోయింది. నిందితుడు ఆమెకు సంబంధించిన చరవాణి, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఓటరు కార్డు తీసుకుని ఫోను స్విచ్ఛాఫ్‌ చేసి వెళ్లిపోయాడు. తొలుత మృతురాలిని గుర్తించిన పోలీసులు చరవాణి సంభాషణల వివరాల ఆధారంగా నిందితుడు ఎవరో కనిపెట్టారు. ఈనెల 10న నిందితుడు గుజ్జుల సందీప్‌ను అరెస్టు చేశారు. నిబంధనల ప్రకారం అతనికి కరోనా పరీక్షలు చేయించారు. నెగిటివ్‌ రిపోర్టులు రావడంతో కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసును చాకచక్యంగా ఛేదించిన ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌, సీఐ అనసూరి శ్రీనివాసరావు, పెదవేగి, ఏలూరు గ్రామీణ ఎస్సైలు నాగవెంకట రాజు, చావా సురేష్‌, హెడ్‌కానిస్టేబుల్‌ వై.ఏసుబాబు, కానిస్టేబుళ్లు కిషోర్‌ ఎస్‌కే నాగూర్‌, సురేష్‌, సురేంద్ర, విజయ్‌కుమార్‌లను ఎస్పీ నారాయణ నాయక్‌ అభినందించారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని