close

తాజా వార్తలు

Published : 14/10/2020 03:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హింస భరించొద్దు... మాకు చెప్పండి!  

రాణి (పేరుమార్చాం) విషయంలో కన్నతండ్రే పశువులా ప్రవర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయి వేధింపులకు గురిచేశాడు. శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. బతుకుమీద ఆశ వదిలేసుకున్న రాణికి ‘మై ఛాయిసెస్‌’ ఇచ్చిన భరోసా.. తిరిగి జీవితంలో నిలదొక్కుకునేలా చేసింది. 

పదహారేళ్లకే ఆశ(పేరుమార్చాం)కి పెళ్లి చేసి గుండెల మీద భారం దించుకున్నారు ఆమె తల్లిదండ్రులు. వ్యసనాలకు బానిసైన భర్త ఆమెను వ్యభిచారంలోకి దింపాలనుకున్నాడు. ఇక చావే శరణ్యం అనుకున్న సమయంలో ఆమెను కాపాడి తన కాళ్లమీద తాను నిలబడేలా చేసింది మై ఛాయిసెస్‌.

ఇరవై ఏళ్లకే వితంతువైన గరిమా(పేరుమార్చాం) ఇద్దరు పిల్లలతో పూటగడవక సతమతమయ్యేది. అలాంటి సమయంలో ఆమెకు ఉపాధి ఆశ చూపించి అక్రమ రవాణా చేయాలనుకుందో ముఠా. ఆ రాక్షసుల చెర నుంచి ఆమెను కాపాడి ఆ చిన్నారుల బాధ్యత తీసుకుంది మై ఛాయిసెస్‌.

కట్టుకున్నవాడు, కన్నతండ్రి మాత్రమే కాదు ఆఖరికి పేగు తెంచుకుని పుట్టిన కొడుకుల చేతిలో కూడా హింసకు గురవుతోన్న మహిళలు ఎందరో! అలాంటి వాళ్లందరికీ చేయూతనిస్తోంది హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ‘మైఛాయిసెస్‌ ఫౌండేషన్‌’. పేదరికం, నిరక్షరాస్యత, పురుషాధిక్య భావజాలం, ... వంటివెన్నో మహిళలపై దురాగతాలకు కారణాలు అంటారు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఎల్కా గాబ్రెల్‌. ఆర్థికశాస్త్రం చదువుకున్న ఎల్కా... జర్మనీ దేశస్థురాలు. ఆమె మొదట ‘ఇంటర్నేషనల్‌ ఆస్ట్రేలియా’ అనే స్వచ్ఛంద సంస్థలో ఉన్నతోద్యోగం చేసేవారు. పేదరిక నిర్మూలనకు క్షేత్రస్థాయి పరిష్కారాల్ని చూపే సంస్థ అది. ‘నా విధుల్లో భాగంగా ఇండియా వచ్చి ఆరునెలల పాటు వివిధ నగరాల్లో ఉన్న మురికివాడలన్నీ తిరిగా. స్థానిక ఎన్జీవోలూ, మహిళా స్వయం సహాయక బృందాలను కలిశా. అప్పుడు మహిళల నుంచి పదే పదే వినిపించిన మాట...‘గృహహింస’. వాళ్ల మాటల్లోని ఆవేదన నామీద చాలా ప్రభావం చూపింది. బాగా ఆలోచించాక ఆర్థిక సాధికారతతోపాటూ మహిళలకు శారీరక, మానసిక రక్షణ అవసరం చాలా ఉందని అర్థమయింది. దాంతో సిడ్నీ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఇక్కడే కుటుంబంతో సహా స్థిరపడ్డా. కానీ ఇక్కడ మార్పుతేవడం అంత సులువు కాదని చాలామంది అన్నారు. ప్రయత్నిస్తేనే కదా.. ఫలితం తెలిసేది’ అంటారు ఎల్కా. 

స్థానికులే కార్యకర్తలు.. 

హైదరాబాద్‌ కేంద్రంగా 2012లో ఈ ఫౌండేషన్‌ సేవల్ని ప్రారంభించింది. జంట నగరాల్లోని ఫలక్‌నుమా, రెడ్‌హిల్స్, షాహీన్‌నగర్, బజార్‌ ఘాట్, యాకూత్‌పురా... ఇలా 122 ప్రాంతాల్లో స్త్రీలపై హింస ఎక్కువగా ఉందని తెలుసుకుందీ సంస్థ. ఆయా ప్రాంతాల్లోని బాధితులని గుర్తించి, బయటకు తీసుకురావడానికి చురుగ్గా ఉండే స్థానికుల్నే కార్యకర్తలుగా మార్చుకుంది. వీళ్లు బస్తీల్లో సాధారణ పౌరుల్లానే తిరుగుతూ హింసకు గురవుతున్న స్త్రీలను గుర్తించి నిపుణులచేత కౌన్సెలింగ్‌ ఇప్పిస్తూ ధైర్యం చెబుతారు. అవసరమైతే ఆశ్రయం కల్పించి, న్యాయ పోరాటంలో సాయమూ చేస్తారు. ఇలా ఈ సంస్థలో ఎనభైమందికి పైగా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరినే ‘పీస్‌ మేకర్‌’లుగా పిలుస్తారు. వీరందరికీ బాధితులని గుర్తించే విషయంలో తగిన శిక్షణ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంస్థ సుమారు 9000 గృహ హింస కేసుల్ని పరిష్కరించింది. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి చర్చలతో పాటు అవసరమైనచోట పోలీసుల సాయాన్నీ, న్యాయవాదుల సహకారాన్నీ తీసుకుంటోంది. 

అక్రమ రవాణాకు... అడ్డుకట్ట 

ఈ సంస్థ గత మూడేళ్లుగా మహిళలూ, బాలికల అక్రమ రవాణాని బలంగా అడ్డుకుంటోంది. ఇందుకోసం ‘ఆపరేషన్‌ రెడ్‌ అలర్ట్‌’ పేరుతో జాతీయస్థాయిలో హెల్ప్‌లైన్‌నీ ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, పశ్చిమ్‌ బంగా, రాజస్థాన్, బిహార్‌లలో స్థానిక స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుని కాలేజీల్లో, గ్రామాల్లో మహిళలూ, బాలికలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ వివిధ హింసల నుంచి బయటపడిన సుమారు వెయ్యిమంది మహిళలకు ఉపాధి కల్పించిందీ సంస్థ. ఇందుకోసం ‘లోటస్‌ సేఫ్‌ హోమ్‌’ పేరుతో పునరావాస కేంద్రాన్ని 2018 నుంచి నిర్వహిస్తున్నారు. తాత్కాలిక పునరావాసం, కౌన్సెలింగ్, న్యాయ సాయం, వృత్తివిద్యల్లో శిక్షణ... వంటివెన్నో ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ‘నిజానికి ఇలాంటి సంస్థను నిర్వహించడం అంత సులువేం కాదు. కౌన్సెలింగ్‌ సెంటర్‌కి వచ్చి ఈ కార్యక్రమాలు ఆపమంటూ చాలామంది గొడవలు చేస్తుంటారు. మా సంస్థ కార్యకర్తలపైనా దాడులకు దిగుతుంటారు. మార్పు కోసం, మహిళల పురోగతికోసం ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధం’ అంటారు ఎల్కా. 

లాక్‌డౌన్‌తో పెరిగిన కేసులు...

కొవిడ్‌-19 పరిస్థితులూ మహిళలపై హింస పెరిగేలా చేశాయంటున్నాయి నివేదికలు. ఇరుకైన ఇళ్లు, పెద్ద కుటుంబాలు, చాలీచాలని సంపాదన... వీటితోపాటు వేళ్లూనుకుపోయిన పురుషాధిక్య భావజాలం దీనికి ప్రధాన కారణాలు. మహిళలతో పాటు ఆడపిల్లలూ ఈ సమయంలో బాధితులుగా ఉన్నారనడానికి హెల్ప్‌లైన్‌ నంబర్లని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఆడపిల్లలకే ఆంక్షలు పెట్టడం, పద్ధతులు నేర్పడం మాత్రమే కాదు, మగ పిల్లలకూ మంచీచెడు చెప్పాలి. మహిళలతో గౌరవంగా నడుచుకోవడం అలవాటు చేయాలి. అప్పుడే ఇవి ఆగుతాయి. 

- ఎల్కా గాబ్రెల్‌Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని