
తాజా వార్తలు
ఇది గ్రహాంతరవాసుల పనేనా?
అమెరికాలో అంతుచిక్కని లోహశిల గుర్తింపు
ఇంటర్నెట్ డెస్క్: యుటాలోని రెడ్ రాక్ ఎడారిలో పాతి ఉన్న ఓ లోహ శిల అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంగారకుడి వాతావరణాన్ని పోలిఉండే ఎరుపురాతి ఎడారిలో స్టీల్ మాదిరి ఏకశిలను అక్కడి ప్రజా భద్రత, వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. పెద్ద కొమ్ములున్న గొర్రెలను లెక్కించేందుకు వన్యప్రాణి విభాగం సిబ్బంది హెలికాప్టర్‌తో సర్వే నిర్వహిస్తుండగా యుటాలోని ఆగ్నేయ ప్రాంతంలో ఓ వస్తువు మెరుస్తూ కనిపించింది. వెంటనే హెలికాప్టర్‌ను దించిన అధికారులు అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరు మనుషుల ఎత్తున్న స్టెయిన్లెస్ స్టీల్ స్తంభం వంటి నిర్మాణం భూమిలో పాతి ఉంది. నవంబర్ 18న ఈ నిర్మాణాన్ని గుర్తించారు.
అయితే అలాంటి మారుమూల ప్రాంతంలో ఆ స్తంభాన్ని ఎవరు పాతారో?ఎందుకు పాతారో తెలియరాలేదు. అందుకే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. స్తంభం లాంటి ఆ నిర్మాణం ఆర్ట్ వర్క్ మాదిరిగా ఉందని జాతీయ ప్రభుత్వం స్థలంలో అలాంటి వాటిని పాతాలంటే అనుమతి తప్పనిసరని అధికారులు పేర్కొంటున్నారు. ఈ స్తంభం విషయం బయటకు తెలిస్తే ఔత్సాహికులు, పరిశోధకులు ఈ ప్రాంతం గురించి వెతికే ప్రయత్నం చేసి ఎడారిలో చిక్కుకుపోతారని అధికారులు భావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలా? వద్దా? అనేది బ్యూరో ఆఫ్ ల్యాండ్స్ మేనేజ్మెంట్ అధికారులు నిర్ణయించనున్నారు. గ్రహాంతరవాసులు ఉన్నారని నమ్మే కొందరు ఈ నిర్మాణం వారి పనేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.