close

తాజా వార్తలు

Updated : 24/07/2020 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. రాజ్‌భవన్‌ వద్ద ముగిసిన హైడ్రామా

అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలంటూ సీఎం అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలో రాజ్‌భవన్‌ వద్ద ధర్నా చేపట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. రాజ్యాంగానికి కట్టుబడి, ఎలాంటి ఒత్తిడులకూ తలొగ్గకుండా సమావేశాలపై నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌ హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు హోటళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు గహ్లోత్‌ నివాసంలో ఈ రాత్రికి కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. వివేకా హత్యకేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.కడపలోని ఆయన స్వగృహంలో గత ఆరు గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈ హత్య కేసులో సీబీఐ అధికారులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారు.ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. హత్యజరిగిన రోజు ఏం జరిగి ఉంటుందన్న దానిపై సునిశితంగా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సీబీఐ సాంకేతిక బృందం పరిశీలిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. నిల్చున్న వారిని కాటేసిన మృత్యువు

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువద్ద రహదారి పక్కన నిల్చున్న వారిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. మృతులను కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంటేరు వాసులుగా గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కారు దిగిన సమయంలో మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పెట్టుబడుల ఆకర్షణలో భారత్ చర్యలు భేష్‌..!

దేశంలో వాణిజ్య వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్‌ చక్కని చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రశంసించింది. అయితే, ఇంకా సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధించేందుకు మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని ఆ సంస్థ ముఖ్య అధికార ప్రతినిధి గెర్రీ రైస్‌ అన్నారు. ఇటీవల అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన గూగుల్‌, ఫేస్‌బుక్‌ భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో గురువారం వాషింగ్టన్‌లో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఏపీలో కరోనా విలయ తాండవం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 8,147 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 80,858కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఆ మాత్రం తెలివి తేటలు మాకున్నాయి: చైనా

భారత్‌-చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి మరొకరి జోక్యం అవసరం లేదని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అన్నారు. ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారు. ప్రాంతంతో సంబంధం లేని శక్తుల ప్రవేశం వల్లే దక్షిణ చైనా సముద్రం వద్ద అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన వరుస ట్వీట్లు చేశారు. చైనా దుందుడుకు వైఖరి వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని భారత్‌లో బ్రిటన్‌ రాయబారి ఫిలిప్‌ బార్టన్‌ గురువారం అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పట్టపగలే విజయవాడలో భారీ దోపిడీ

విజయవాడ పాతబస్తీ కాటూరివారి వీధిలోని నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. పట్టపగలే దుండగులు 7 కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.42లక్షల నగదును దోచుకున్నారని బాధితులు చెబుతున్నారు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జ్యువెల్లరీ వ్యాపారి శ్యాంకు పాతబస్తీ శివాలయం వీధిలో ‌నగల దుకాణం, కాటూరువారి వీధిలో వెండి వస్తువులు విక్రయించే దుకాణంలో భాగస్వామ్యం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. భారత్‌ కోలుకుంటోంది..!

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఈ వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనాను జయించిన వారి సంఖ్య 24గంటల్లో మరో రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే 34,602 మంది రోగులు కోలుకోవడంతో దేశంలో రికవరీ రేటు 63.45శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ప్రభుత్వానికి ఆ అధికారం ఎవరిచ్చారు?

నిమ్మగడ్డ రమేశ్‌ను ప్రభుత్వం ఎస్‌ఈసీగా పునరుద్ధరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్లేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే నిరాకరించడాన్ని ఆయన స్వాగతించారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వపాలన గాడి తప్పిందని, రాజ్యాంగాన్ని విస్మరిస్తోందని సుప్రీం వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఐఫోన్‌ 11 ఇక మేకిన్‌ ఇండియా

ప్రముఖ మొబైల్‌ కంపెనీ యాపిల్‌.. తన ఐఫోన్‌ 11 మోడల్‌ తయారీని భారత్‌లో ప్రారంభించింది. చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో తయారీకి ఇది ఊతమిచ్చే విషయమని ఆయన పేర్కొన్నారు. ఐఫోన్‌ తొలుత ఎస్‌ఈ మోడల్‌ను బెంగళూరు ప్లాంట్‌లో తయారు చేయడం మొదలుపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.