close

తాజా వార్తలు

Published : 28/07/2020 20:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. సినీ నటుడు రావి కొండలరావు కన్నుమూత

ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు (88) కన్నుమూశారు. 600కుపైగా చిత్రాల్లో నటించి, అనేక చిత్రాలకు దర్శకనిర్మాతగా, రచయితగా పని చేసిన ఆయన బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (28/7/20)న తుదిశ్వాస విడిచిచారు. ఆయన భార్య దివంగత రాధాకుమారి కూడా సినిమా నటే. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్రపంచంలోని పులుల్లో 70 శాతం భారత్‌లోనే

ప్రపంచం మొత్తం మీద ఉన్న పులుల సంఖ్యలో 70 శాతం భారత దేశంలో ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆయన దేశంలో పులుల గణాంకాలతో కూడిన నివేదికను మంగళవారం విడుదల చేశారు. ‘‘ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. ఇందుకు భారత్ ఎంతో గర్వపడుతోంది. పులుల సంఖ్యను పెంచేందుకు టైగర్‌ రిజర్వులు ఉన్న 13 దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని జవడేకర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏపీలో సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. గాల్లోనే ఇంధనం: రఫేల్ ఫొటోలు చూశారా..

భారత గగనతల రక్షణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తూ భారత వాయుసేన అమ్ముల పొదిలో ఒదిగిపోయేందుకు మరి కొద్ది గంటల్లో రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 30 వేల అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఫొటోలను భారత వాయుసేన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఎమ్మెల్సీ అభ్యర్థులను నామినేట్‌ చేసిన ఏపీ గవర్నర్‌

గవర్నర్‌ నామినేట్‌ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వారిని నామినేట్‌ చేయాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం సిఫార్సుల మేరకు జకియా ఖానం, పాండుల రవీంద్రబాబును ఎమ్మెల్సీలుగా గవర్నర్‌ నామినేట్‌ చేశారు. గతంలో కంతేటి సత్యనారాయణ రాజు, టి. రత్నభాయిలు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు ఉండగా.. వారి పదవీకాలం మార్చిలోనే ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘‘ఇప్పుడొచ్చే ఆదాయం డీజిల్‌కే ఖర్చవుతోంది’’

ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ ఆర్‌ఎంలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందిపై కరోనా ప్రభావం, వైరస్‌ వ్యాప్తి, ఆర్టీసీ పరిస్థితి, ప్రజలకు సేవలు అందిస్తూనే సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ ‘‘మే 21 నుంచి 30శాతం బస్సులే నడుస్తున్నాయి. కరోనా భయంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం వచ్చే ఆదాయం డీజిల్‌ ఖర్చుకే సరిపోతోంది’’అని కృష్ణబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. రేపు టీఎస్‌ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్‌ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్‌లోడ్‌ చేసుకోచ్చని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది.

8. జీవీకే ఆఫీస్‌ల్లో తనిఖీలు

జీవీకే గ్రూప్‌ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్‌రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు నిర్వహించింది. ముంబయి ఎయిర్‌పోర్టు స్కాంకు సంబంధించి హైదరాబాద్‌, ముంబయిల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికే జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బలగాల ఉపసంహరణ పూర్తయింది: చైనా

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు చైనా పేర్కొంది. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ వెల్లడించారు. త్వరలోనే తర్వాత దశ సైనికస్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అందుకు భారతీయులు నన్ను క్షమించాలి

భారతీయుల మనోభావాలు కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పెద్ద కుమారుడు యాయిర్‌ క్షమాపణలు చెప్పారు. ఇజ్రాయెల్‌ రాజకీయ నాయకులను ఉద్దేశించి ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో హిందువుల ఆరాధ్య దైవం దుర్గాదేవిని పోలి ఉండటంతో పలువురు భారతీయ హిందువులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో యాయిర్‌ సదరు ట్వీట్‌ను తొలగిస్తూ క్షమాపణలు కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.