close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ఏపీలో దిశ యాక్ట్‌: అత్యాచారం చేస్తే ఉరిశిక్షే

మహిళల భద్రత కోసం కఠిన చట్టాన్ని తీసుకొస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన  సమావేశంలో ..ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా(సవరణ)చట్టం 2019, ఏపీ దిశ యాక్ట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అత్యాచారానికి పాల్పడినా, చిన్నారులపై లైంగికదాడికి పాల్పడినా ఈ చట్టం ప్రకారం మరణశిక్ష  విధిస్తారు. నిర్ధరించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు వచ్చేలా బిల్లు రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మోదీకి నానావతి కమిషన్‌ క్లీన్‌చిట్‌

గుజరాత్‌ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ క్లీన్‌ చిట్‌ లభించింది. 2002 గుజరాత్‌లోని గోద్రా అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి కమిషన్‌ నివేదికలో మోదీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్‌ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ 2014 వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన పాలనలో ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్ల ఘటన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలకు అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల విఫలం కావడమే కారణమని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

 కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు-2019కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో పౌరసత్వ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఓటింగ్‌ సమయంలో సభలో 209 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 117 మంది, వ్యతిరేకంగా 92 మంది ఓటు వేశారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. జమ్మూకశ్మీర్‌ నుంచి అసోంకు సైన్యం!

ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం భారీగా బలగాలను తరలిస్తోంది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆయా రాష్ట్రాలకు ఐదు వేల మంది సైనికుల్ని తరలిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడడంతో అక్కడి నుంచి 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలను తరలించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మీడియా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. జమ్మూ నుంచి మొత్తం 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలను జమ్మూ నుంచి అసోంకు పంపినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్‌

వాతావరణంలో కలిగే మార్పులు భావి తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ లయోలా కళాశాలలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం సృష్టించిన ఇబ్బందులు అందరికీ తెలిసినవేనన్నారు. దిల్లీ పర్యటనకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు

స‌మ‌త కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదో అదనపు సెషన్స్‌, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అసోంలో ఇంటర్నెట్‌ బంద్‌

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 24 గంటల పాటు పది జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో శాంతి, ప్రశాంతతకు సోషల్‌మీడియా వేదికలు భంగం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఐఎల్‌పీ పరిధిలోకి మణిపూర్‌

ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ)ను మణిపూర్‌కూ వర్తింపజేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసత్వ చట్ట సవరణలను ఐఎల్‌పీ పరిధిలోని రాష్ట్రాలకు వర్తింపజేయబోమని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్‌ వాసులు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తంచేశారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మణిపూర్‌ను కూడా ఐఎల్‌పీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. దంచికొట్టిన భారత్‌.. విండీస్‌ టార్గెట్‌ 241

వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో భారత బ్యాట్స్‌మెన్‌ దంచికొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌శర్మ(71; 34 బంతుల్లో 6x4, 5x6), కేఎల్‌ రాహుల్‌(91; 56 బంతుల్లో 9x4, 4x6), విరాట్‌ కోహ్లీ(70; 29 బంతుల్లో 4x4, 7x6) చెలరేగడంతో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. 

10. వర్మ సినిమా విడుదలపై వీడిన సస్పెన్స్‌

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం విడుదలపై సస్పెన్స్‌ వీడింది. ఈ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు, రివ్యూ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించిన తర్వాత సెన్సార్‌బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.