close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ‘సభాపతి, మంత్రులు డమ్మీలుగా మారారు’ 

మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ సభాపతి, మంత్రులు డమ్మీలుగా మారారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కించపరిస్తే ఆనందపడుతున్నారు. నిరసనలు తెలియజేయకుండా నియంత్రిస్తున్నారు’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మీరూ ఒకరోజు కూలిపోతారు: పవన్‌

రైతు సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షను విరమించారు. రైతులు పవన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నాయకులు మాత్రం బాగానే ఉన్నారు.. రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభను ఎంతో హుందాగా నడపాలి.. .దూషణలతో నడుపుతున్నారు. కూల్చివేతతో మొదలుపెట్టారు.. అందరినీ కూల్చేస్తున్నారు. మీరూ ఒక రోజు కూలిపోతారు’’ అని పవన్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. నిర్భయ దోషి పిటిషన్‌పై 17న విచారణ

2012 అత్యాచార కేసులో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్‌ సింగ్‌ ఠాకూర్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్‌ను ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ నెల 17న విచారణ చేపట్టనుంది. ఓపెన్‌ కోర్టులో మధ్యాహ్నం 2గంటలకు ఈ పిటిషన్‌ను విచారించనున్నారు. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రివ్యూ పిటిషన్‌ విచారణ చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నిర్మలా సీతారామన్‌తో తెరాస ఎంపీలు భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెరాస ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతర నిధులు విడుదల చేయాలని ఆమెను కోరారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను ఎంపీలు కేంద్రమంత్రికి అందజేశారు. అనంతరం తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమాయానికి అందేలా కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘మహా’ మంత్రివర్గం కుదిరిందిలా..

మహారాష్ట్రలో కొలువుదీరిన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో మంత్రి పదవుల పంపకం వ్యవహారంలో స్పష్టత వచ్చింది. మంత్రివర్గ కూర్పులో కీలక శాఖల కేటాయింపులను పరిశీలిస్తే.. శివసేనకు హోంశాఖ, నగరాభివృద్ధి శాఖలు దక్కగా.. ఎన్సీపీకి ఆర్థికశాఖ, గృహనిర్మాణం, వైద్యం, సహకార మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అలాగే, కాంగ్రెస్‌కు రెవెన్యూ, విద్యుత్‌,  విద్య, టెక్స్‌టైల్‌, ప్రజా పనుల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నిర్భయ దోషుల ఉరి కోసం ఇద్దరు తలారీలు!

నిర్భయ ఘటనలో దోషులకు త్వరలో ఉరిశిక్ష విధించనున్న నేపథ్యంలో తిహాడ్‌ జైలు అధికారులు తలారీల కోసం యూపీ జైళ్ల శాఖకు లేఖ రాశారు. తమకు అవసరమైనప్పుడు ఇద్దరు తలారీలను పంపించాలని అందులో పేర్కొన్నారు. దోషులెవరు?ఉరి ఎప్పుడు? వంటి సమాచారం ఏదీ అందులో లేదు. ఈ మేరకు డిసెంబర్‌ 9న తిహార్‌ జైలు నుంచి ఫ్యాక్స్‌ ద్వారా తమకు సమాచారం అందిందని యూపీ జైళ్ల శాఖ అదనపు డీజీ ఆనంద్‌ కుమార్‌ గురువారం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఎయిరిండియా 100శాతం వాటాను విక్రయిస్తాం

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ గురించి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లోక్‌సభకు రాతపూర్వక సమాధానంగా తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. క్యాబ్‌ సెగ.. పోలీసు ఉన్నతాధికారులపై వేటు

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే ఉన్నతాధికారితో పాటు గువాహటి పోలీస్‌ కమిషనర్‌ను బదిలీ చేసింది. గువాహటి సిటీ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న దీపక్‌ కుమార్‌స్థానంలో మున్నా ప్రసాద్‌ గుప్తాను నియమించింది. అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ముకేశ్‌ అగర్వాల్‌ను సీఐడీకి పంపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అక్టోబర్‌లో పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి!

దేశాన్ని ఆర్థిక మందగమనం ఓవైపు వెంటాడుతుంటే.. మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి కూడా పడిపోతోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 3.8శాతానికి పడిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌, ఖనిజాలు, ఉత్పత్తి రంగాల్లో నెలకొన్న పేలవమైన ప్రదర్శనే ఇందుకు కారణం. గతేడాది ఇదే సమయానికి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 8.4గా  ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఐపీఎల్‌ వేలానికి 332 మంది షార్ట్‌లిస్ట్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 సీజన్‌ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఏర్పాట్లన్నీ పూర్తైనట్టు సమాచారం. ఈ నెల 19 కోల్‌కతాలో వేలం జరగనుంది. మొత్తం 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది వేలానికి ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. వేలానికి ఎంపికైన వారిలో 24 మంది కొత్తవారే ఉన్నారని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.