close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. మండలి రద్దుకు శాసనసభ ఆమోదం

ఏపీ శాసన మండలి రద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మండలి రద్దుపై సీఎం జగన్‌ శాసనసభలో ఈరోజు ఉదయం తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు దానిపై చర్చించారు. చర్చలో జగన్‌ మండలి రద్దు తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే కారణాలను వివరించారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ఈ తీర్మానంపై ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్‌ కోరారు. సభ్యులంతా లేచి నిలబడగా శాసనసభ సిబ్బంది లెక్కించి అనుకూలంగా 133 మంది ఉన్నట్లు తేల్చారు. తటస్థంగా, వ్యతిరేకంగా ఎవరూ లేరని స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. అన్నీ ఆలోచించే మండలి రద్దు నిర్ణయం:జగన్‌

పార్టీగా తమకున్న అవకాశాల కన్నా కూడా ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యమని అందుకే మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలి రద్దుపై శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘మండలి కచ్చితంగా అవసరం’ అని రాజ్యాంగంలో లేదని చెప్పారు. మండలి అవసరమా? లేదా? అన్నది అసెంబ్లీనే నిర్ణయిస్తుందన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఆరు చోట్ల మాత్రమే మండలి ఉందని.. అన్ని అంశాలను ఆలోచించి, ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఓటింగ్‌లోనూ నాటకమాడారు: చంద్రబాబు

మండలి రద్దుకు శాసనసభ తీర్మానం చేయడం విచారకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తు్న్నట్లు చెప్పారు. మూడు రాజధానుల బిల్లును మండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపారనే ఆక్రోశంతో శాసన మండలి రద్దుకు తీర్మానం చేసి పంపడం దురదృష్టకరమన్నారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో సభలో 121 మంది ఉన్నారని చెప్పి.. ఆఖరికి 133 మంది ఉన్నారని ప్రకటించడమేంటని ఆయన ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కరీంనగర్‌ కార్పొరేషన్‌ తెరాస కైవసం

కరీంనగర్‌ కార్పొరేషన్‌పై గులాబీ జెండా రెపరెపలాడింది. నగర పాలక సంస్థలో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. మేయర్‌ పీఠానికి అవసరమైన స్థానాలను గెలుచుకుని తెరాస జయభేరి మోగించింది. 13 డివిజన్లలో గెలుపొంది భాజపా రెండో స్థానంలో నిలిచింది. తెరాస మిత్రపక్షం ఎంఐఎం 7 డివిజన్లలో గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇతరులు 7 చోట్ల గెలుపొందారు. పురపోరులో మొత్తం 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. పదింటినీ తెరాసనే కైవసం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘సచివాలయం’ పిటిషన్‌ 12కు వాయిదా

సచివాలయ నిర్మాణం విచారణను హైకోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. సచివాలయ నిర్మాణం, అంచనా వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అదనపు ఏజీ రాంచందర్ రావును హైకోర్టు ఆదేశించింది. నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మార్పుల్లేవ్‌: రాత్రి 8కే ఐపీఎల్‌ మ్యాచులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచుల సమయం మారలేదు. ఎప్పటిలాగే రాత్రి 8 గంటలకు ఆట ఆరంభమవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. తొలిసారిగా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. ఇకపై నోబాల్‌ నిర్ణయాలను మూడో అంపైర్‌ తీసుకుంటారని వెల్లడించారు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముంబయిలో మే 24న జరుగుతుందన్నారు. సోమవారం ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మండలి రద్దు సహేతుకం కాదు: పవన్‌

శాసన మండలి రద్దు సవ్యమైన చర్య కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని చెప్పారు. శాసన మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పవన్‌ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘ప్రలోభాలకు లొంగకపోవడంతోనే మండలి రద్దు’

వికేంద్రీకరణ బిల్లు నెగ్గించుకోవడం కోసం తెదేపా ఎమ్మెల్సీలను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారని తెదేపా ఎమ్మెల్సీలు ఆరోపించారు. బిల్లులు పాస్‌ అయ్యేందుకు అనేక రకాలుగా ప్రయత్నించి.. కుదరకపోవడంతో మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎవరైనా ప్రలోభాలకు లొంగుతారని భావించే మూడు రోజుల పాటు వేచి చూశారని ఆరోపించారు. శాసన మండలిలో ఇప్పటి వరకు ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలను చర్చించామని తెదేపా ఎమ్మెల్సీలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రాష్ట్రంలో పవన్‌తో కలిసి పనిచేస్తాం: లక్ష్మణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణలో కూడా కలిసి పనిచేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఇప్పటికే పవన్‌తో ఫోన్‌లో మాట్లాడామని, త్వరలో భేటీ అవుతామని చెప్పారు. దేశంలో భాజపాతో కలిసి పనిచేసేందుకు పవన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో పవన్‌ సేవలు తీసుకుంటామని చెప్పారు. జనసేన-భాజపా కలిసి పనిచేసి రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి కుటుంబ పాలనను దించుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. పార్టీ రంగులు తొలగించాల్సిందే: హైకోర్టు

పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వైకాపా రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగు వేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని, కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.