close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. మండలి కార్యదర్శి తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు 

ఏపీ శాసనమండలి కార్యదర్శిపై ఛైర్మన్‌ షరీఫ్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లుల రద్దు అంశంలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై బులెటెన్‌ విడుదల చేయాలన్న తన ఆదేశాలను మండలి కార్యదర్శి రెండుసార్లు తిరస్కరించడంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. మండలిలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో  భేటీ అయ్యారు. సెలెక్ట్‌ కమిటీ నియమించే అంశంలో జరిగిన వ్యవహారాన్నే గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రేపు రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు తొలి భేటీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారం దిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలను ట్రస్టు సభ్యులు చర్చించనున్నారు. రామ మందిర నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించడం, మందిర నిర్మాణానికి ప్రజల నుంచి పారదర్శకంగా విరాళాల సేకరణ, భవిష్యత్తు కార్యచరణ వంటి కీలక అంశాలు సమావేశ అజెండాగా ఉన్నాయి. నిర్ణీత సమయంలోగా రామ మందిరాన్ని నిర్మించాలని ట్రస్టు ఆశిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ధాన్యం డబ్బులింకా చెల్లించరేం?: పవన్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతు సంక్షేమమంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడంలేదని ధ్వజమెత్తారు. ధాన్యం అమ్మిన రైతులకు ఈరోజు వరకు రూ.2016 కోట్లు చెల్లించాల్సి ఉందనీ.. ఈ మొత్తం రోజురోజుకీ పెరుగుతూ వస్తోందని పవన్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ‘ఆల్‌ఇన్‌ వన్‌’ యాప్‌..!

 ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారులు వివిధ రకాల ఫైల్స్‌ను ఎడిట్‌, ఫార్మాట్‌ చేసుకోవడానికి.. వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌ యాప్స్‌ ప్రత్యేకంగా ఇన్‌స్టాల్‌ చేసుకునే పద్ధతికి పుల్‌స్టాప్‌ చెప్పింది. ఆ ఫీచర్లన్నింటినీ ఒకే యాప్‌లో అందిస్తూ.. ఆల్‌ ఇన్‌ వన్‌ అప్లికేషన్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. 9 పద్దులు..9 భారాలతో వైకాపా పాలన:కళా

వైకాపా నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. రేపటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న ప్రజా చైతన్య యాత్ర కరపత్రాలను మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ యాత్రను తెదేపా అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. వైకాపా 9 నెలల పాలన 9 పద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలనూ రద్దు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ, విద్యుత్‌, పెట్రో ఛార్జీలను పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ట్రంప్‌ కోసం ముస్తాబవుతోన్న తాజ్‌మహల్‌

మొదటిసారిగా భారత్‌ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్‌ ముస్తాబవుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. దీనికోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి రాక నేపథ్యంలో ఆగ్రా పరిసర ప్రాంతాలను ముస్తాబుచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘ఈటీవీ భారత్‌’కు డిజిటల్‌ మీడియా అవార్డు

డిజిటల్ మీడియా రంగంలో దూసుకెళుతున్న ‘ఈటీవీ భారత్’ అరుదైన ఘనత సాధించింది. దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డిజిటల్ మీడియాలో ఉత్తమ ఆవిష్కరణలకు గాను.. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ సంస్థ (వాన్-ఇఫ్రా) ఈ పురస్కారాన్ని అందించింది. ‘ఈటీవీ భారత్’ డైరెక్టర్ బృహతి దిల్లీలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. హీరో రూ.10వేల కోట్ల పెట్టుబడి..!

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం హీరో మోటార్స్‌ వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సుస్థిరమైన రవాణ పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనుంది. ఈ క్రమంలో భాగంగా కంపెనీ విద్యుత్తు వాహనాలను అభివృద్ధి చేయడంతోపాటు స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తుంది. ఈ మొత్తం వ్యవస్థతో కలిసి కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేస్తుంది. ఇప్పటికే హీరోకు ప్రధాన పోటీదారులైన బజాజ్‌, టీవీఎస్ సంస్థలు విద్యుత్తు స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆసక్తికర కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చిన ఐసీసీ

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. 2023-31 మధ్య కాలంలో టీ20 ఛాంపియన్స్‌ కప్‌ను నిర్వహించాలనే సరికొత్త ఆలోచనతో ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ మాదిరే ఈ టోర్నీలోనూ మొత్తం 48 మ్యాచ్‌లు ఆడే అవకాశముందని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. ఐసీసీ తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం.. 2024, 2028 సంవత్సరాల్లో టీ20 ఛాంపియన్స్‌ కప్‌ నిర్వహించాలని భావిస్తుండగా.. 2025, 2029ల్లో వన్డే ఛాంపియన్స్‌ కప్‌ ఉండాలనుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కొత్త ఇన్నింగ్స్‌: వెబ్‌సిరీసులో నటిస్తున్న యువీ

టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరోసారి అందరినీ అలరించబోతున్నాడు. ఐతే ఈ సారి బ్యాటు, బంతితో కాదు. తన నటనతో. అవును, యువీ ఓ వెబ్‌సిరీస్‌లో నటించనున్నాడు. అసోంకు చెందిన డ్రీమ్‌హౌజ్‌ ప్రొడక్షన్స్‌ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది. యువీ సోదరుడు జొరావర్‌ సింగ్‌ది ప్రధాన పాత్ర. అతడి సతీమణి హజెల్‌ కీచ్‌ సైతం కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇక యువీ తల్లి షబ్నమ్‌ సింగ్‌ ఈ వెబ్‌సిరీస్‌ నిర్మాణంలో భాగమవుతుండటం ప్రత్యేకం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.