టాప్‌ 10 న్యూస్ @ 9 PM
close

తాజా వార్తలు

Published : 05/07/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ఎలిమెంట్స్: తొలి దేశీయ సోషల్‌ మీడియా యాప్‌

రోజు రోజుకి దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌ ఎలిమెంట్స్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్‌ ఆఫ్ లివింగ్’  వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మంది ఐటీ నిపుణులు, ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు కలిసి ఈ యాప్‌ను రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. హైదరాబాద్‌లో మరో 33 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్‌ మహానగరంలో కొత్తగా మరో 33 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్‌ వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి మొత్తం దవాఖానాల సంఖ్య 200కు చేరుతుందని తెలిపారు. తొలి దశలో 123, రెండో దశలో 44 దవాఖానాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించి మెరుగైన సేవలందిస్తున్నట్టు చెప్పారు. నగర వాసులకు ప్రభుత్వ ప్రాథమిక వైద్యం మరింత చేరువ కానుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. విమాన సేవలు పుంజుకుంటున్నాయ్‌

పౌర విమానయాన సేవలు క్రమంగా పుంజుకుంటున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. లాక్‌డౌన్‌ను సడిలిస్తున్న నేపథ్యంలో మే 25 నుంచి కొన్ని మార్గాల్లో విమానయాన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలు అరకొరగా ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు.  తాజాగా శనివారం ఒక్కరోజే అత్యధికంగా 75,000 మంది ప్రయాణించినట్లు హర్దీప్‌ సింగ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సీఎం జగన్‌కు నరసాపురం ఎంపీ మరో లేఖ

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి లేఖ రాశారు. వృద్ధాప్య పింఛను వయో పరిమితి 65 ఏళ్లు నుంచి 60కి తగ్గిస్తూ గతేడాది జీవో ఇచ్చారని గుర్తుచేశారు. 2019, జూలై నుంచి జీవో అమలు చేస్తామని చెప్పి.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల ఒక్కో లబ్ధిదారుడు ఏడు నెలలకు రూ.15,750 నష్టపోయారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కరోనా కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం : సంజయ్‌

రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదన్నారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని, దానిని రాజకీయ విమర్శగా భావించారే తప్ప, పరిగణనలోకి తీసుకోలేదని వాపోయారు. కరోనా సోకిన పేద ప్రజలు సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. వారి విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయండి: ఉత్తమ్‌

లాక్‌డౌన్‌ వేళ బీపీఎల్‌ కుటుంబాలు, ఎంఎస్‌ఎంఈలకు విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లక్షలాది మంది విద్యుత్‌ వినియోగదారులు విద్యుత్‌ బిల్లుల్లో లోపాలపై ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ గానీ, ఇంధన శాఖ గానీ ఎలాంటి దిద్దుబాటు చర్యలూ తీసుకోలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కరోనా వ్యాక్సిన్‌ ఇప్పట్లో రానట్లేనా?

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచానికి సాంత్వన చేకూర్చేలా వ్యాక్సిన్‌‌ తయారీ చివరి దశలో ఉన్నట్లు  భారత్‌ బయోటెక్‌, జైడస్‌ సంస్థలు ప్రకటించాయి. కోవాగ్జిన్‌, జైకోవ్‌-డి పేరిట ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించాయి. మరోవైపు భారతీయ వైద్య ఆరోగ్య మండలి కూడా ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఐపీఎల్‌ నుంచి వచ్చే ఆదాయం దేశాభివృద్ధికే..

ఐపీఎల్‌ నుంచి వచ్చే ఆదాయం దేశాభివృద్ధికి తోడ్పడుతుందని, అది బీసీసీఐ అధికారులకు చేరదని కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నారు. ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ను ఆర్థిక సంపత్తిగా భావించే వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా క్రిక్‌బజ్‌ కార్యక్రమంలో మాట్లాడిన ధుమాల్‌ ఇలా స్పందించారు. ‘ఆడేందుకు అన్ని పరిస్థితులు బాగుంటేనే ఐపీఎల్‌ జరుగుతుంది. ఐపీఎల్‌ అంటే డబ్బు తయారీ యంత్రమని అంతా అంటున్నారు. అలాగైతే అదే అనుకోండి. కానీ ఆ డబ్బంతా ఎవరు తీసుకుంటారు?’ అని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. దిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్స కేంద్రం ప్రారంభం

పది వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌-19 చికిత్స కేంద్రాన్ని దక్షిణ దిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. చ్చతర్‌పుర్‌ పట్టణ కేంద్రంలోని రాధా సోమి సత్సంగ్‌ బియాస్‌ క్యాంపస్‌లో ఆసుపత్రిని సిద్ధం చేశారు. సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ (ఎస్‌పీసీసీసీహెచ్‌)గా నామకరణం చేసిన ఈ ఆసుపత్రిని దిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన ఉగ్ర‌వాదుల‌కు క‌రోనా!

జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శ‌నివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే, వీరి మృత‌దేహాల‌కు కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్‌గా తేలిన‌ట్లు క‌శ్మీర్ పోలీసులు వెల్లడించారు. మెడికో-లీగ‌ల్ ప‌రీక్షల్లో భాగంగా చనిపోయిన ఉగ్ర‌వాదుల‌కు శ్రీన‌గ‌ర్‌లోని సీడీ ఆసుప‌త్రిలో పోస్టుమార్టంతోపాటు డీఎన్ఏ, కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీనిలో ఉగ్ర‌వాదులిద్ద‌రికీ వైర‌స్ సోకినట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని