close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/07/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆర్‌బీకే: విత్తనం నుంచి పంట విక్రయం వరకు

‘‘57 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ బకాయిలు చెల్లిస్తున్నాం. ఇకపై సున్నా వడ్డీ మొత్తాన్ని రైతు ఖాతాలోనే జమ చేస్తాం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల రైతులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో 10,641 చోట్ల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.  విత్తనం నుంచి పంట విక్రమం వరకు ఇబ్బంది లేకుండా ఆర్‌బీకేలు చూస్తాయని సీఎం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఆసియా కప్‌-2020 రద్దు: గంగూలీ

ఆసియాకప్‌-2020 రద్దైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. జులై 9న ఆసియా క్రికెట్‌ మండలి సమావేశం జరగడానికి ముందే దాదా ఈ విషయం వెల్లడించడం గమనార్హం. ‘ఆసియా కప్‌ రద్దైంది’ అని దాదా అన్నారు. కాగా ఈ నిర్ణయాన్ని ఆసియా క్రికెట్‌ మండలి తీసుకుందా లేదా ఆయన వివరించలేదు. ‘టీమ్‌ఇండియా తొలి అంతర్జాతీయ సిరీస్‌ ఏదవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. మా సన్నద్ధత సాగుతోంది. అయితే ప్రభుత్వ నిబంధనలు తెలిసేదాకా ఏమీ చేయలేం’ అని గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మేముంటే లక్షా 20 వేలు ఇచ్చేవాళ్లం: చంద్రబాబు

రైతుభరోసా కొత్త పథకం కాదు... అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతుభరోసా తెచ్చారు అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుభరోసా పథకం, రైతు దినోత్సవంపై చంద్రబాబు మాట్లాడారు. ‘‘రైతుభరోసాతో ఐదేళ్లలో రైతుకు ప్రస్తుతం వచ్చేది రూ. 37,500 మాత్రమే. మా ప్రభుత్వం ఉంటే ఒక్కో రైతుకు రూ. లక్షా 20 వేలు వచ్చేవి. బడ్జెట్‌లో చెప్పిన సంఖ్యలోనే పది లక్షలమందికి రైతు భరోసా ఎగ్గొట్టారు. 34 వేల ఎకరాలు ఇచ్చినవారి ప్రాణాలు తీయడమే రైతు దినోత్సవమా’’ అని  చంద్రబాబు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మూడు బీమా సంస్థలకు రూ.12వేల కోట్లు

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని నవంబర్‌ వరకు పొడిగించినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధికోసం భారీగా నిధులను మంజూరు చేశారు. మూడు ప్రభుత్వ రంగ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు రూ.12,450 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. నయా గద్దర్‌ గళంలో పోగైన కరోనా.. చివరకు!

ఆయనో కవి గాయకుడు. తెలంగాణ ఉద్యమంలో తన కలం, గళంతో ప్రజలను చైతన్య వంతుల్ని చేసిన యోధుడు. ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై ఎలుగెత్తుతూ నయా గద్దర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేత, ప్రజానాట్య మండలి కార్యదర్శిగా సేవలందించారు. ఆయనే సుద్దాల నిస్సార్‌. కొవిడ్‌-19కు మెరుగైన చికిత్స కోసం ఆయన అనేక ఆస్పత్రులు తిరిగారని సమాచారం. అయినప్పటికీ ఎక్కడా చేర్చుకోలేదు. చివరికి గాంధీలో చేరితే వెంటిలేటర్‌ సదుపాయం లేక తుదిశ్వాస విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కుల్‌భూషణ్‌ జాదవ్‌పై పాక్‌ కొత్త కుట్ర?

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ విషయంలో దాయాది దేశం కుట్రలకు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ వేయడానికి జాదవ్‌ నిరాకరించినట్లు చెబుతోంది. దానికంటే తాను తొలుత దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పైనే ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. టిక్‌టాక్‌పై నిషేధాన్ని ప‌రిశీలిస్తున్నాం: ట్రంప్‌

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి కార‌ణ‌మైన చైనా తీరుపై అగ్ర‌రాజ్యం అమెరికా ఇప్ప‌టికే గుర్రుగా ఉంది. ప్ర‌పంచాన్ని వంచించిన చైనాపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తోన్న అమెరికా, టిక్‌టాక్ యాప్ నిషేధాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు అమెరికా విదేశాంగమంత్రి ఇప్ప‌టికే సంకేతాలిచ్చారు. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టిక్‌టాక్ నిషేధంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. తాజాగా ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ స్పందించారు. టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించే విష‌యాన్ని త‌మ ప‌రిపాల‌నావిభాగం ప‌రిశీలిస్తోందని ట్రంప్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మంత్రి ఫిర్యాదు... స్పందించిన ఎంపీ

నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు అంశంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. తనపై ఎంపీ రఘు రామకృష్ణ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ వ్యాఖ్యలు తన పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు. రఘు రామకృష్ణ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రూ.330 కోట్ల నీరవ్‌ ఆస్తుల జప్తు

బ్యాంకును మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ముంబయి, లండన్‌, యూఏఈలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.330 కోట్లుగా ఈడీ పేర్కొంది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద ఈ ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది. నీరవ్‌ మోదీకి చెందిన రూ.2,348 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇదివరకే స్వాధీనం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘‘అవసరమైతే వైద్యబృందాలు పంపిస్తామన్నారు’’

‘‘హైదరాబాద్‌ ప్రజల ఆందోళనను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి వివరించాను. తెలంగాణకు అన్ని విధాలా సాయం చేస్తామని ఆయన చెప్పారు. అవసరమైతే వైద్య బృందాలను పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కిషన్‌ రెడ్డి కలిసి తెలంగాణలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించారు. అనంతరం కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.