టాప్ 10 న్యూస్ @ 9 PM
close

తాజా వార్తలు

Published : 15/07/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ప్రతి కౌలు రైతుకూ రుణం: కన్నబాబు

ప్రతి కౌలు రైతుకూ బ్యాంకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్‌సీ) ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌలు రైతులు, పాడి రైతులు, జాలర్లకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఈ ఏడాది రూ. 8,500 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కన్నబాబు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. గాంధీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమ్మె విరమణ

జీతాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లతో సమ్మెకు దిగిన గాంధీ ఆస్పత్రిలోని పొరుగు సేవల సిబ్బంది ఆందోళన విరమించారు. గత రెండు రోజులుగా వీరు ఆందోళన చేపట్టారు. ఇవాళ ఉదయం నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో డీఎంఈ రమేశ్‌ రెడ్డితో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. షిఫ్టుల వారీగా నెలలో 15 రోజుల విధులకు అధికారులు అంగీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ప్రతిఒక్కరికీ అందుబాటులో ఇంటర్నెట్‌! పిచాయ్‌

రూ.33,737కోట్ల పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 7.7శాతం వాటాను గూగుల్‌ సొంతం చేసుకోనుందని రిలయన్స్‌ వెల్లడించింది. దీనిపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్‌ సదుపాయం ఉందుబాటులో ఉండాలి. గూగుల్‌ ఫర్‌ ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌లో భాగంగా తొలుత దాదాపు రూ.33,737కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్‌ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ లేని లక్షలమందికి అందుబాటులోకి తీసుకురావడం కోసం జియోతో కలిసి పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది’ అని సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పెరుగుతున్న కేసులు.. తితిదే కీలక నిర్ణయం

చిత్తూరు జిల్లాలో నానాటికీ కరోనా కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి బర్డ్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ సేవలను అందించేందుకు నిర్ణయించింది. అలాగే భక్తులు ఆశ్రయం పొందేందుకు ఉద్దేశించిన తిరుపతిలోని విష్ణు నివాసాన్ని సైతం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చేందుకు తితిదే ఆమోదం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. చైనాతో మాట్లాడటం ఇష్టంలేదు: ట్రంప్‌

రెండో దశ వాణిజ్య ఒప్పందం కోసం చైనాతో సంప్రదింపులు జరపడం తనకు ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. దీంతో అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందానికి తలుపులు మూసుకుపోయాయి. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కారణంగా చైనాతో మాట్లాడడానికి ఆసక్తి లేదని అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కరోష్యూర్‌: తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షలు

తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షను నిర్ధారించే కొత్త విధానాన్ని దిల్లీ ఐఐటీ విద్యార్ధుల బృందం అభివృద్ధి చేసింది. ‘కరోష్యూర్‌’గా పిలిచే ఈ కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ నిశాంక్‌, మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రేతో కలిసి బుధవారం విడుదల చేశారు.  ఈ కిట్‌ అందుబాటులోకి రావడం చారిత్రాత్మక సందర్భమని అభివర్ణించిన మంత్రి, ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఆర్‌టీ-పీసీఆర్‌ (రియల్‌టైమ్‌-పీసీఆర్) ఆధారిత కరోనా పరీక్షల కిట్‌ను రూపొందించిన తొలి విద్యాసంస్థగా ఐఐటీ దిల్లీ నిలిచిపోతుందని ప్రశంసించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. సీఎం జగన్‌కు కేంద్రమంత్రి హర్షవర్థన్‌ ఫోన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పరీక్షలు జరపడంపై దృష్టి పెట్టామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ వివరించారు. రోజుకు 22 వేలకు పైగా టెస్టులు జరుపుతున్నామన్నారు. వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించి, బాధితులకు త్వరితగతిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఇన్‌స్టాలో తీస్తాడు.. మార్ఫింగ్‌ చేసి బెదిరిస్తాడు!

జీవితంలో స్థిరపడేందుకు ఎవరైనా యానిమేషన్‌ కోర్సు చేస్తారు. ఓ ప్రబుద్ధుడు తాను నేర్చుకున్న ఈ నైపుణ్యాన్ని వక్రమైన పనులకు వినియోగించాడు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి.. అమ్మాయిలను బెదిరిస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు ఎస్పీ విశాల్‌ గున్నీ మీడియాకు వివరించారు. యువతుల ఫొటోల మార్ఫింగ్‌ కేసులో రఘుబాబు అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి అమ్మాయిల ఫొటోలను తీసి మార్ఫింగ్‌ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. చౌకైన ఆ మూడు కొవిడ్‌-19 ఔషధాలు ఏంటి?

కొవిడ్‌-19 ఔషధాలు నల్లబజారుకు తరలిపోకుండా అడ్డుకోవాలని హోంశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రభుత్వానికి సూచించింది. సమర్థంగా పనిచేస్తూ చౌకగా లభిస్తున్న మందులు కాకుండా ఎక్కువ ధరవి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించిందని తెలిసింది. నల్ల బజారుకు తరలించడం, కృత్రిమ కొరత గురించి కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. గణితంతో కుస్తీ కాదు.. దోస్తీ చేయండి

శకుంతల దేవి అనగానే ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ అని ఠక్కున చెప్పేస్తుంది పాత తరం. అంతగా ఆమె పేరు మార్మోగిపోయింది. కంప్యూటర్లకు సరిసమానంగా, ఒక్కోసారి వాటి కంటే వేగంగా గణితంలోని చిక్కు ప్రశ్నలను సైతం పరిష్కరించేవారు. గణితంలో ఎలా అయితే చిక్కుముళ్లు ఉన్నాయో శకుంతల దేవీ జీవితంలోనూ ఉన్నాయి. అవేంటో మీకు చెప్పడానికే ‘శకుంతల దేవి’గా  విద్యాబాలన్‌ వస్తున్నారు. ఈ నెల 31న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా విడుదల నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని