close

తాజా వార్తలు

Published : 11/08/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ‘రాయలసీమ ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్టు కాదు’

కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖపై సీఎం జగన్‌ ప్రత్యుత్తరం పంపారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని, రాష్ట్రం తరఫున మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమావేశానికి సంబంధించి ఏపీ నుంచి స్పందన లేదంటూ ఈనెల 7న  రాసిన లేఖ సరికాదని జగన్‌ అన్నారు. ‘‘రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే ఎత్తిపోతలు చేపట్టాం. రాయలసీమ ఎత్తిపోతలు కొత్త  ప్రాజెక్టు కాదని మనవి చేస్తున్నా’’ అని సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. చీఫ్‌ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాల సంఖ్య పెంపు

తెలంగాణ నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మార్పులకు అనుగుణంగా శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి వసతులు, ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు పెరిగాయన్నారు. పంప్‌హౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని చెప్పారు. చీఫ్‌ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాల సంఖ్యను 13 నుంచి 19కి పెంచినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. హైదరాబాద్‌లో మరో 26 బస్తీ దవాఖానాలు

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న హైదరాబాద్‌ నగరంలో మరో 26 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బస్తీ  దవాఖానాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ బస్తీ దవాఖానాలను మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. బస్తీ దవాఖానాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెనుమత్స తనయుడు

వైకాపా నేత మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. ఈ నెలలోనే ఆ స్థానం భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైకాపా తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని తాజాగా ఖరారు చేసింది. పార్టీ తరఫున పోటీగా ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి.. వైకాపా సీనియర్‌ నేత పెనుమత్స సాంబశివరావు తనయుడు, విజయనగరం జిల్లా మొయిదాకు చెందిన సురేశ్‌బాబును దింపాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. 9,024 కొత్త కరోనా కేసులు @ ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో (9am-9am)కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 58,315 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్‌ కేసులు ఉండగా..  1,54,749మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులో 9,113 మంది కోలుకున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. పేదవారి బాధేంటో తెలుస్తోందా: రాహుల్

దేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. అలానే పట్టణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం తమ పార్టీ సూచించిన కనీస ఆదాయ హామీ పథకం (ఎన్‌వైఏవై) కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటి అమలుతో ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. వడ్డీ లేదు.. నల్లా బిల్లు చెల్లించండి: కేటీఆర్‌

జలమండలికి బిల్లులు సక్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రజలను కోరారు. మంగళవారం ఆయన జలమండలి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకం కరపత్రాలు, బ్యానర్లు, గోడపత్రికలను ఆవిష్కరించారు. ‘‘జలమండలి బకాయిదారులకు సువర్ణావకాశం కల్పిస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల వసూళ్ల కోసం వడ్డీని మాఫీ చేశాం. కేవలం బకాయి ఉన్న అసలు బిల్లు మాత్రమే చెల్లించండి. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం సెప్టెంబర్‌ 15 వరకు ఉంటుంది’’అని కేటీఆర్‌ తెలిపారు.

8. విద్యార్థులకు ఉచిత సెల్‌ఫోన్‌

రాష్ట్రంలోని యువతకు సెల్‌ఫోన్లు అందించనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఓ పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా యువతకు మొబైల్‌ ఫోన్లు అందిచనున్నట్లు మంగళవారం పేర్కొంది. ‘కరోనా గడ్డు కాలంలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాలేక అనేక మంది విద్యార్థులు బాధలు పడుతున్నారు. ప్రభుత్వం అందించబోతున్న సెల్‌ఫోన్లు వారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. టైమ్స్‌స్క్వేర్‌ వద్ద రెపరెపలాడనున్న జాతీయ జెండా

ఈ ఆగస్టు 15 నాడు న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద భారత జాతీయ జెండా రెపరెపలాడనుంది. ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒక ప్రముఖ సంస్థ అమెరికాలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనుంది. ‘మేం చరిత్ర సృష్టించబోతున్నాం’ అని న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌కు చెందిన ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్‌ అసోసియేషన్(ఎఫ్‌ఐఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను’

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం సమసిసోయింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. అయితే తనతో పూర్తిగా విభేదించి పార్టీని వదిలి వెళ్లన తన విరోధి సచిన్‌పైలట్‌తో అధిష్ఠానం సయోధ్య కుదుర్చకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. ‘తిరుగుబాటు ఎమ్మెల్యేలను క్షమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఏ ఎమ్మెల్యే అయినా నాపై కోపంగా ఉంటే.. వారి సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. నేను గతంలో ఇలానే చేశాను.. ఇప్పుడూ చేస్తాను’ అని గహ్లోత్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.