close

తాజా వార్తలు

Published : 21/10/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఏపీలో వాహన జరిమానాలు భారీగా పెంపు

మోటారు వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించేవారిపై విధించే జరిమానాలను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జరిమానాలను రెండు కేటగిరీలుగా నిర్ణయించారు. ద్విచక్ర వాహనంతో పాటు తేలికపాటి నాలుగు చక్రాల వాహనాలు ఒక కేటగిరీ.. భారీ వాహనాలను మరో కేటగిరీగా విభజించారు. వాహనాల తనిఖీ సమయంలో సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ.750 జరిమానా విధించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చెరువుల ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్రంలో అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీల్లో సంబంధిత జిల్లా ఎస్పీ సభ్యుడిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ కమిటీలు అక్రమణలను గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ అంశంపై డిసెంబరు 10 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బెంగళూరు vs కోల్‌కతా

ఐపీఎల్ టీ20 లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. అబుదాబి వేదికగా బెంగళూరు, కోల్‌కతా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి నాలుగు ఓవర్లలోనే కోల్‌కతా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఆఫర్.. 48 గంటలు ఉచితం

నెట్‌ఫ్లిక్స్‌ భారత వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ 48 గంటలపాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలను అందించనున్నారట. నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో భాగంగా ‘స్ట్రీమ్‌ ఫెస్ట్‌’ అనే కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాన్ని తొలుత మన దేశంలోనే తీసుకొస్తారట. అందులో భాగంగా డిసెంబరు 4 నుంచి 48 గంటల ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్ తీసుకొస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సీఎం జగన్‌ దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం రోజు కావడంతో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంతకుముందు ఘాట్‌ రోడ్డు మార్గంలో ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు పాలకమండలి ఛైర్మన్‌ పైలా స్వామినాయుడు, ఈవో సురేశ్‌బాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2019-2020 బోనస్‌ను ప్రకటించింది. ఈ ఏడాది బోనస్‌ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు బుధవారం తీపికబురు అందించింది. ప్రభుత్వ నిర్ణయంతో 30.67 లక్షల మందికి లాభం చేకూరనుంది. ప్రస్తుతం ప్రకటించిన బోనస్‌ విలువ రూ.3,737 కోట్లు అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. ఉత్పాదక, ఉత్పాదకేతర బోనస్‌ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. వరదలతో పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా?

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలామంది వాహనాలు దెబ్బతిన్నాయి. సాధారణంగా వాహనాల్లో చిన్న భాగం పాడైనా రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక ఎక్కువ భాగాలు దెబ్బతిన్నప్పుడు అయ్యే ఖర్చు గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటి తరుణంలో వాహనదారులు బీమా వైపు చూస్తుంటారు. కానీ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే వరదల సమయంలో వాహనాలు పాడైతే వాటికి బీమా వర్తిస్తుందా? లేదా? అని. అయితే తీసుకున్న పాలసీల ఆధారంగా వాహనాలకు కవరేజీ ఉంటుందని అని బీమా నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. గేల్‌ను కట్టేశా.. ప్రమాద ఘంటిక.. సూపర్‌ వద్దు

టీ20 క్రికెట్‌ లీగ్‌‌ రసవత్తరంగా సాగుతోంది. ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నారు. తమతో తామే పోటీ పడుతున్నారు. మ్యాచులో హోరాహోరీగా తలపడుతున్న ప్రత్యర్థులు.. ఆట ముగిశాక సరదా కబుర్లు చెప్పుకుంటున్నారు. భారీ అంచనాలను నిజం చేసుకొనేందుకు ఆత్మస్థైర్యం కావాలని షమి అంటే.. బౌలింగ్‌ చేయడానికి ముందే గేల్‌ కాళ్లు కట్టేశానని అశ్విన్‌ అంటున్నాడు. వరుస ఓటములు తమకు ప్రమాద ఘంటికలని శ్రేయస్‌ భావిస్తున్నాడు. ఐపీఎల్‌ కబుర్లు ఇంకా ఏమున్నాయంటే..! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. చైనాకు తగలనున్న మరో షాక్‌..

ప్రభుత్వ అనుమతి పొందే అవసరం లేకుండానే విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా సంస్థల ముసుగులో పొరుగున ఉన్న డ్రాగన్ మన దేశంలో కార్యకలాపాలను సాగించడాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా త్వరలోనే ఓ నిబంధన అమలులోకి రానున్నట్టు తెలిసింది. భారతీయ విశ్వవిద్యాలయాలు దేశ సరిహద్దుల్లో ఉన్న ఏ దేశానికి చెందిన విద్యాసంస్థతో అయినా అవగాహనా ఒప్పందానికి  (ఎంఓయూ) వచ్చే ముందు.. విద్యా శాఖ  అనుమతి పొందటం ఇకపై తప్పనిసరి కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏపీలో కొత్తగా 3,746 కొవిడ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,422 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,746 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,93,299కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,508 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 7,739 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,54,415కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.