close

తాజా వార్తలు

Published : 26/11/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. 30నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 30వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

2. ఆగం కావొద్దు.. ఆలోచించండి: కేటీఆర్‌

నగరంలో వరదలు వచ్చినపుడు రాని కేంద్రమంత్రులు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి మాత్రం గుంపులు గుంపులుగా వస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. దిల్లీ నుంచి సుమారు 12 మంది కేంద్రమంత్రులు వస్తున్నట్లు భాజపా నేతలు చెబుతున్నారని.. ఇక్కడ కేసీఆర్‌ సింహంలా సింగిల్‌గానే వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్‌ లయోలా కళాశాల రోడ్డు, యాప్రాల్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. ప్రశాంతంగా ఉంటేనే హైదరాబాద్‌కు పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.  ఆగం కావొద్దు.. ఆలోచించండని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*భాజపా మేనిఫెస్టోపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

3. 28న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శామీర్‌పేట సమీపంలోని భారత్‌ బయోటెక్‌ను మోదీ సందర్శించనున్నారు. కొవిడ్‌ నివారణకు సంబంధించి భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ టీకా పురోగతిని పరిశీలించనున్నారు. అనంతరం ప్రధాని పుణె పర్యటనకు వెళ్లనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆ ఆరు రాష్ట్రాల్లోనే 60శాతం కేసులు!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ, పండుగల అనంతరం కొన్ని ప్రదేశాల్లో తీవ్రత పెరిగింది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ 40వేలు దాటింది. నిన్న ఒక్కరోజే 44,489 కేసులు నమోదుకాగా వీటిలో 60శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే రికార్డయ్యాయి. వీటిలో కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. 2 బిలియన్‌ డాలర్లకు అన్‌అకాడమీ విలువ..!

కరోనా వ్యాప్తితో ఎడ్యూటెక్‌ స్టార్టప్‌ల విలువ రేసుగుర్రాలను తలపిస్తోంది. మూడు నెలల క్రితమే 150 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించిన సమయంలో ఎడ్యూటెక్‌ స్టార్టప్‌ ‘అన్‌అకాడమీ’ విలువను 1.45 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. తాజాగా మరో విడత నిధుల సేకరణను మొదలు పెట్టిన ఈ సంస్థ భారీ విలువను సొంతం చేసుకొంది. ఈ విడతలో టైగర్‌ గ్లోబల్‌, డ్రాగనీర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ల నుంచి వీటిని పొందనుంది. ఈ క్రమంలో కంపెనీ విలువను 2 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. పెట్టుబడి వివరాలు మాత్రం బయటకు రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ధోనీ స్థానం భర్తీ చేయడం కష్టం: రాహుల్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అయితే అతడి పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. తన అవగాహన మేరకు మైదానంలో స్పిన్నర్లకు సలహాలు ఇస్తానని వెల్లడించాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహులే కీపింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*కోహ్లీ, రోహిత్‌ పాక్‌ లీగ్‌లో ఆడితే బాగుంటుంది..

7. మతతత్వ పార్టీగా ముద్రవేస్తున్నారు: అసదుద్దీన్‌

ఉగ్రవాదానికి మతం ఉండదని.. కానీ ఇప్పుడు దాన్ని ఒక మతంతో జోడిస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. మజ్లిస్‌ను మతతత్వ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఎర్రగడ్డలో నిర్వహించిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ కేవలం హక్కుల కోసం పోరాడుతుందన్నారు. మనసులు కలిపే ప్రయత్నం చేస్తోందని.. మనసులను విడగొట్టేలా చేయదని చెప్పారు. 1960 నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీని దేశవ్యతిరేక పార్టీగా భాజపా ఆరోపిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘కేసీఆర్‌జీ..ఎన్ని కేసులైనా పెట్టుకోండి’

కేసులు పెట్టి భాజపాను ఆపలేరని ఆ పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో పాల్గొన్నారు. అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ తేజస్వీ సూర్యపై హైదరాబాద్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తేజస్వీ స్పందిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 67,269 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,031 కేసులు నిర్ధారణ కాగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,65,705కి చేరింది. తాజా మరణాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 6,970 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,081 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,46,120కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వన్‌ప్లస్‌ నార్డ్‌కి పోటీగా మోటో5G మొబైల్‌

భారత్‌లోకి 5జీ మొబైల్స్‌ రాక మొదలైంది. వన్‌ప్లస్‌ ఇప్పటికే ‘నార్డ్‌’ సిరీస్‌తో రాగా, మోటోరోలా సిద్ధమైంది. ఈ నెల 30న మోటో జీ 5జీని తీసుకొస్తున్నారు. ధర, స్పెసిఫికేషన్ల విషయంలో వన్‌ప్లస్‌‌ నార్డ్‌ మొబైల్‌కు పోటీగా నిలుస్తుందని అంటున్నారు. మోటోరోలా నుంచి ఇప్పటికే 5జీ సాంకేతికతతో ‘రేజర్‌‌ 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దాని ధర సామాన్య వినియోగదారుడికి అందనంత ఉంది. దాంతో పోలిస్తే మోటోజీ 5జీ తక్కువ ధరలో దొరకబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన