
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 PM
1. బయటివారు జీహెచ్ఎంసీ దాటి వెళ్లాలి: ఎస్ఈసీ
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్లపాటు జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారథి స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఎస్ఈసీ మీడియాతో మాట్లాడారు. ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఆదేశించారు. అంతేకాకుండా డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* గ్రేటర్లో ముగిసిన ప్రచార గడువు
2. పోరాడినా భారత్‌కు తప్పని ఓటమి
మరోసారి భారత్‌కు పరాభవం తప్పలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 51 పరుగులతో ఓటమిపాలై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కోల్పోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాట్స్‌మన్ గొప్పగా శ్రమించినా.. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్ భారత్ ఓటమికి కారణమయ్యాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 389 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 338 పరుగులకు పరిమితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రైతుల ఆందోళనలను అలా అనలేదు: అమిత్ షా
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి స్పందించారు. రైతుల ఆందోళనలు రాజకీయ ప్రేరేపిత నిరసనలుగా తానెప్పుడూ పేర్కొనలేదని స్పష్టంచేశారు. అంతేకాకుండా ప్రస్తుతం కూడా అలా పిలవనని అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి అమిత్‌షా, ఈ విధంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
*‘చలో దిల్లీ’లో విషాదం
4. కేసీఆర్ ముఖంలో కళ కనిపించలేదు:కిషన్‌రెడ్డి
గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొని ఓటింగ్‌శాతాన్ని పెంచాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా భాజపాకు విశేష ఆదరణ లభించిందని.. తెరాస ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలు కోరుకున్న మార్పు భాజపా ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెరాస బహిరంగసభలో కేసీఆర్ మాటల్లో, ముఖంలో కళ కనిపించలేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ- స్పీకర్ల సదస్సులో చేసిన ప్రతిపాదనతో మరోమారు జమిలి ఎన్నికలు చర్చనీయాంశమౌతున్నాయి. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఈ జమిలిపై ఇప్పటికే మోదీ అనేకసార్లు తన సానుకూలతను వ్యక్తంజేస్తూ వస్తున్నారు. తాజాగా మరోమారు ఆయన తన మనసులో మాట బయటపెట్టారు! ఇంతకూ జమిలి ఎన్నికలు సాధ్యమేనా? వాటివెనకాలున్న సాధకబాధకాలేంటి? జమిలిపై ఇప్పటిదాకా జరిగిన కసరత్తేంటి?... చూస్తే... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అమెరికా నుంచి భారీగా పెరిగిన ఎఫ్‌డీఐలు!
భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న మారిషస్‌ను వెనక్కి నెట్టింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అమెరికా నుంచి భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఏప్రిల్-సెప్టెంబర్ 2020 మధ్య కాలంలో అమెరికా నుంచి 7.12 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. మారిషస్ నుంచి 2 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఎయిర్టెల్ ఆఫర్: 11GB వరకు ఉచిత డేటా
జియో వచ్చాక టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడం పరిపాటి. అదే బాటలో ఎయిర్టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ బొనాంజా ప్రకటించింది. నూతనంగా 4G సిమ్‌ను తీసుకోవడం గానీ, 4Gకి డివైస్‌కు అప్‌గ్రేడ్ అయిన వినియోగదారులకు 11GB వరకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఏపీలో కోటి దాటిన కరోనా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 54,710 కొవిడ్ సాంపుల్స్‌ని పరీక్షించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,00,17,126కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 620 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,988కి చేరింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,67,683కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. వణుకుతోన్న ఉత్తరం..!
ఇప్పటికే కరోనా తీవ్రతతో వణుకుతున్న ఉత్తర భారతంపై చల్లని గాలుల ప్రభావం మరింత ఎక్కువకానుంది. ప్రస్తుతం శీతాకాలంలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోగా, రానున్న మూడు నెలల్లో శీతల గాలులతో ఉత్తర, మధ్య భారతం వణికిపోయే అవకాశాలున్నాయని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. VIRAL: సముద్ర లోతుల్లోకి ఎలా వెళ్లాలంటే..!
సముద్ర గర్భంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉంటాయి. లోతైన మహా సముద్రాల అడుగు భాగంలో ఏమి ఉంటుందో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజానీకానికి ఆసక్తి ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోను గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంస్థ యూట్యూబ్‌లో ఉంచింది. వీడియోలో అమెరికాకు చెందిన నావికాదళ మాజీ అధికారి అయిన విక్టర్ వెస్కోవో తాము సముద్ర లోతులోకి ఎలా చేరుకుంటామో వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి