
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 PM
1. 350 వస్తువులపై ఆంక్షల కత్తి..
వివిధ అవసరాల కోసం దిగుమతి చేసుకొనే 350 రకాల వస్తువులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ఎలక్ట్రానిక్, టెక్స్టైల్స్, బొమ్మలు, ఫర్నిచర్ వంటివి ఉన్నాయి. దేశీయ సంస్థలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా వస్తువుల దిగుమతి అవసరాలను పరిశీలించేందుకు ఓ మానిటరింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కరోనా విషయంలో 4 ‘T’లు పాటించండి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. కరోనా కట్టడికి ముఖ్యంగా ‘4టీ’ టెస్ట్ (పరీక్ష), ట్రేస్ (కరోనా వచ్చిన వారిని గుర్తించడం), ట్రీట్ (చికిత్స), టీచ్ (ఎదుటివారికి చెప్పడం) పాటించాలని ఆమె ప్రజలకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రష్యా వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్స్ పూర్తి
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. వాలంటీర్లపై పరీక్షలు పూర్తయ్యాయని ఆ యూనివర్సిటీలోని ఇనిస్ట్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అండ్ బయో టెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి
భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా భాజపా కార్యాలయంలో ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం బయటకు వెళ్తున్న సమయంలో కొంతమంది తెరాస కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. దీంతో అక్కణ్నుంచి బయలుదేరిన అరవింద్ కారును అడ్డుకోవడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుంటుండగా.. కాన్వాయ్‌పై దాడి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘‘ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి’’
‘‘రాష్ట్రంలో కరోనా ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం లేక చాలామంది ప్రైవేటుకు వెళ్తున్నారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం కిషన్ రెడ్డి ఆన్లైన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించి ప్రజల్లో నమ్మకం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రాజస్థాన్ సంక్షోభం... జ్యోతిరాదిత్య కామెంట్!!
రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జ్యోతిరాదిత్య సింథియా కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలట్నుద్దేశిస్తూ ఆదివారం ట్వీట్ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీపైనా విరుచుకుపడ్డారు. పార్టీ పరంగా పక్కన పెట్టడమే కాక.. సీఎం అశోక్ గహ్లోత్ నుంచి తన మాజీ సహచరుడు వేధింపులు ఎదుర్కోవడం చూస్తుంటే బాధగా ఉందని ట్వీట్ చేశారు. ప్రతిభకీ, సామర్థ్యానికీ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లేదని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఐశ్వర్యరాయ్‌కు కరోనా పాజిటివ్
ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు కరోనా సోకింది. ఆమెతోపాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశాడు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌కు శనివారం కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఐశ్వర్య, ఆరాధ్య శాంపిల్స్‌కు పాజిటివ్ వచ్చింది. తొలుత యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చింది.. ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. దుబే ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్ జడ్జీతో విచారణ!
ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు యూపీ ప్రభుత్వం స్వతంత్ర ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహించే ఈ కమిషన్ రెండు నెలల్లోగా నివేదిక సమర్పించనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. రషీద్‌ఖాన్.. అది ఇప్పట్లో జరిగే పనేనా?
ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లలో అఫ్గానిస్థాన్ ఒక్కసారి విజేతగా నిలిచాకే పెళ్లి చేసుకుంటానన్నాడు ఆ జట్టు సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్. తాజాగా ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన సన్‌రైజర్స్ బౌలర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య ఆజాది రేడియోకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. ‘మా జట్టు ఒక్కసారి ప్రపంచకప్ గెలవగానే నేను పెళ్లి చేసుకుంటా’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రాజస్థాన్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
రాజస్థాన్‌లో రాజకీయ వేడి రాజుకుంది. డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్.. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దిల్లీకి చేరడంతో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం సంకట స్థితిలో పడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం సోమవారం ఉదయం 10.30 గంటలకు భేటీ కానుంది. సీఎం గహ్లోత్ నివాసంలో ఈ భేటీ జరగనుంది. తొలుత ఆదివారం రాత్రే ఈ సమావేశం నిర్వహించాలనుకున్నప్పటికీ వాయిదా పడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి