
తాజా వార్తలు
పవన్‌పై ప్రకాశ్‌రాజ్ విమర్శ.. నాగబాబు కౌంటర్!
హైదరాబాద్: నాయకుడిగా పవన్‌కల్యాణ్ సొంత పార్టీని స్థాపించి.. భాజపాకు మద్దతు తెలపడం తనకి నచ్చలేదని నటుడు ప్రకాశ్‌రాజ్ విమర్శించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్, భాజపా గురించి ప్రకాశ్‌రాజ్ పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశ్‌రాజ్ చేసిన విమర్శలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయని నాగబాబు అన్నారు. అంతేకాకుండా భాజపా-జనసేన పొత్తు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా తమ సత్తాచాటుతుందని ఆయన పేర్కొన్నారు.
‘రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. కానీ అవి ప్రజలు, పార్టీ రెండింటికీ ఉపయోగపడేలా ఉంటే ఎంతో మంచిది. జనసేన పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు పవన్‌కల్యాణ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రజా, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ప్రకాశ్‌రాజ్ గారు.. మీ ఉద్దేశంలో భాజపా తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించండి. అందులో తప్పులేదు. అదేవిధంగా భాజపా లేదా ఏ ఇతర పార్టీ అయినా ప్రజలకు మంచి చేస్తే హర్షించాలి. విమర్శించడం తప్ప హర్షించగలిగే మనసు లేని మీ గురించి ఏం చెప్పగలం. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి భాజపా, ఆంధ్రప్రదేశ్‌కు జనసేనతోనే అభివృద్ధి సాధ్యం. మీలాంటి వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా భాజపా-జనసేన శక్తిని నిలువరించలేరు. భాజపా-జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తాచాటుకోబోతున్నాయి.’ అని నాగబాబు కౌంటర్ ఇచ్చారు.