నితీశ్ సర్కార్‌  వేగంగా స్పందించకపోయుంటే..
close

తాజా వార్తలు

Updated : 23/10/2020 12:57 IST

నితీశ్ సర్కార్‌  వేగంగా స్పందించకపోయుంటే..

వైరస్‌కు ఇంకా ఎక్కువమంది బలయ్యేవారు : మోదీ

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌కు ఇంకా ఐదు రోజులే మిగిలి ఉండటంతో అక్కడ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలోని ససారాంలో మోదీ మాట్లాడుతూ.. కొవిడ్ కట్టడికి ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ తీసుకున్న చర్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. నితీశ్‌ ప్రభుత్వం వేగంగా స్పందించకుండా ఉంటే, ఇంకా ఎక్కువ సంఖ్యలో కొవిడ్ మరణాలు సంభవించి ఉండేవన్నారు. ‘కరోనా వైరస్ కట్టడి విషయంలో బిహార్ వేగంగా స్పందించకుండా ఉండి ఉంటే, ఆ వైరస్‌కు ఇంకా ఎక్కువ మంది బలయ్యేవారు. రాష్ట్రం అల్లకల్లోలంగా మారేది. కానీ ఇప్పుడు బిహార్ కొవిడ్‌పై పోరాడి ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటోంది’ అంటూ ప్రశంసించారు. 

అలాగే అక్కడి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై మోదీ విమర్శలు గుప్పించారు. ఎన్‌డీఏ నేతృత్వంలోని నితీశ్ ప్రభుత్వం రాకమునుపు ఆర్జేడీ పాలనలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయి.. నేరాలమయంగా ఉండేదన్నారు. ‘ఒకప్పుడు బిహార్‌ను పాలించిన వారు ఇప్పుడు మళ్లీ ఈ రాష్ట్రంవైపు దురాశతో చూస్తున్నారు. బిహార్‌ను అన్నిరంగాల్లో వెనకబడేసిన వారిని ప్రజలు మర్చిపోకూడదు. ఆ సమయంలో శాంతిభద్రతలు, అవినీతి దారుణంగా ఉండేది’ అంటూ విమర్శలు చేశారు. అలాంటి చోట, ఈ ప్రభుత్వం కరోనా వైరస్‌ మహమ్మారి సమయంలో ఉచితంగా ఆహారం అందజేసిందని గుర్తుచేశారు. వలస సంక్షోభాన్ని పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలకున్న స్పష్టత తనను ఆశ్చర్యపర్చిందని, తిరిగి ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని సర్వేలు వెల్లడిచేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదాను అందించే అధికరణ 370 రద్దు గురించి కూడా ప్రస్తావించారు. దానిపై విపక్షాల తీరును విమర్శించారు. 

అంతేకాకుండా, భారత్ సరిహద్దులో గల్వాన్‌ ఘర్షణలో, పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన బిహార్‌కు చెందిన జవాన్లకు ప్రధాని నివాళులు అర్పిస్తూ, వారి ధైర్యసాహసాలను కొనియాడారు. అలాగే ఇటీవల మరణించిన ఆ రాష్ట్ర సీనియర్‌ నేతలు రాంవిలాస్ పాసవాన్‌, రఘువంశ ప్రసాద్ సింగ్‌కు నివాళులు అర్పించారు. కాగా, మూడు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని