
తాజా వార్తలు
తెలంగాణలో 41 కేసులు.. 117 మంది డిశ్చార్జ్
హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 31 కేసులు నమోదుకాగా.. మరో 10 మంది వలసదారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 1,367కి చేరింది. ఇవాళ కరోనా బారినుంచి కోలుకొని అత్యధికంగా 117 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 939కి చేరింది. ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తంగా 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 394 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో ఇప్పటివరకు యాదాద్రి-భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 14 రోజులుగా రాష్ట్రంలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, వికారాబాద్, నల్గొండ, కుమరంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, జనగామ, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.