
తాజా వార్తలు
నిజామాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు డీఎంఈకి సమాచారమిచ్చారు. అంతేకాకుండా ఆస్పత్రి డాక్టర్ల వాట్సాప్ గ్రూప్‌లోనూ రాజీనామా చేస్తున్నట్లు వాయిస్ మెసేజ్ పెట్టారు. వైద్యసేవల విషయంలో విమర్శలు రావడంతో మనస్థాపం చెందానని ఆయన వెల్లడించారు.
రెండు రోజుల కిందట నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు కరోనా బాధితులు. దీంతో వైద్య సేవల నిర్లక్ష్యంపై ఆరోగ్యశాఖ అధికారులు ఆయనపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన తర్వాత రోజే ఆటోలో శవాన్ని తరలించే విషయం కూడా వివాదాస్పదంగా మారింది. ఇది కూడా సూపరింటెండెంట్ మెడకు చుట్టుకుంది. దీనిపైనా జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన రాజీనామాను డీఎంఈ ఆమోదిస్తారా?లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.