close

తాజా వార్తలు

ఉల్లిపై అప్పుడన్ని మాటలన్నారే.. ఇప్పుడెందుకిలా?

ముంబయి: దేశంలో ఆర్థిక మందగమనం.. ఉల్లిధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై శివసేన తీవ్ర విమర్శలు చేసింది. మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకొని పలు సమస్యలను ప్రస్తావిస్తూ తన అధికార పత్రిక సామ్నాలో విమర్శనాస్త్రాలు సంధించింది. ‘‘ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. కానీ ప్రభుత్వం దీన్ని అంగీకరించేందుకు సిద్ధంగాలేదు. మరోవైపు,  ఉల్లి ధర కిలో రూ.200కు చేరింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఓ చిన్న పిల్లలాగా సమాధానం చెప్పారు. తాను ఉల్లి-అల్లం తినను.. అందుకే తనను ఉల్లి ధరల గురించి అడగవద్దన్నారు. ప్రధాని మోదీకి ఈ సమస్యను పరిష్కరించాలన్న కోరిక లేదని దీన్నిబట్టే అర్థమవుతోంది’’ అని పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థను స్టాక్‌మార్కెట్‌లా భావిస్తున్నారు..

‘‘నరేంద్ర మోదీ ప్రధానిగా లేని సమయంలో ఉల్లి ధరలు పెరుగుదలపై మాత్రం ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఉల్లి ఎంతో కీలకమైనదని.. అలాంటి వాటిని ఎంతో భద్రంగా దాచుకోవాలంటూ చెప్పారు. కానీ ఈ రోజు ఆయన విధానం మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ పతనానికి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీని బాధ్యులను చేయడం సరికాదు. నిపుణుల సలహాలను కూడా వినే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఆర్థిక వ్యవస్థను ఈ ప్రభుత్వం ఓ స్టాక్‌మార్కెట్‌లా ఊహించుకుంటోంది’’

ఆర్థికమంత్రిని అప్పుడు అంధకారంలో ఉంచారు!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తింది. ‘‘పీఎంవోలో కొద్ది మంది మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు అధికార పార్టీ రాజకీయాలకు, సామాజిక కార్యక్రమాలకు చెల్లుతాయి. కానీ వారి నిర్ణయాలు ఆర్థిక సంస్కరణలను మరింత దిగజారుస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిని అంధకారంలో ఉంచారు. ఆర్బీఐ గవర్నర్‌ దీనిపై నిరసన వ్యక్తంచేయగా.. ఆయన్ను తొలగించారు’’ అని సామ్నా విమర్శించింది.

పేదరిక నిర్మూలనకు చర్యలేవీ?

పేదరిక నిర్మూలనపైనా కేంద్రం తగిన విధంగా పోరాటం చేయడంలేదని శివసేన ఆక్షేపించింది. ‘‘ప్రపంచ ఆకలి సూచీలో మొత్తం 107 దేశాల జాబితాలో భారత్‌ 102వ స్థానంలో ఉంది. 2014లో భారత్‌ 55వ స్థానంలో ఉండేది. దేశంలో పేదరికం పెరిగిపోతోంది. పొరుగు దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లలో పేదరికం తగ్గుతోంది. ప్రజలకు చేతిలో పనిలేదు.. తినేందుకు తిండిలేదు. దేశంలో సామాన్యుడి పరిస్థితి ఇదీ.. కానీ పాలకులు మాత్రం దీన్ని అభివృద్ధి అంటున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా మోదీ సర్కార్‌ మాత్రం దీన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు’’ అని సామ్నాలో రాసుకొచ్చింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.