close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 01/02/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మేం భేష్‌.. ఇవీ సాధించాం: నిర్మల

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సబ్‌కా సాత్‌ - సబ్‌కా వికాస్‌ - సబ్‌కా విశ్వాస్‌’ ఇదే తమ ప్రభుత్వ లక్ష్యమనీ.. ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. లోక్‌సభలో శనివారం ఆమె దాదాపు రెండున్నర గంటలకు పైగా చేసిన సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగంలో 2020-21 బడ్జెట్‌ కేటాయింపులు, తదుపరి లక్ష్యాలతో పాటు తమ ప్రభుత్వం ఐదున్నరేళ్లలో సాధించిన విజయాలను చెప్పుకొచ్చారు. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపుతో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత భారత్‌గా తీర్చిదిద్దామన్నారు. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం గొప్ప విజయం సాధించిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో పునరుత్తేజంతో దేశ అభివృద్ధికి పనిచేస్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తిని పెంచేలా ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్టు తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 

అవినీతి మరకలేని స్వచ్ఛ పాలన
‘‘జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అవినీతి మరకలేని స్వచ్ఛ మైన పాలనను అందిస్తున్నాం. వ్యాపార వర్గాల్లో  విశ్వాసం పెంచేలా పన్ను చెల్లింపు ఛార్టర్‌ రూపొందించాం. పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు స్వస్తి చెప్పే చర్యలు తీసుకొంటున్నాం. వారిపై ఉన్న క్రిమినల్‌ శిక్షలు సివిల్‌ విధానానికి మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. సివిల్‌ విధానంలో మార్పునకు త్వరలోనే చట్టసవరణ చేస్తాం. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధాని ఆవాస్‌ యోజన ద్వారా పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తున్నాం. 2019లో కేంద్రంపై 48.7శాతం రుణభారం తగ్గింది’’ అని పేర్కొన్నారు.

284 బిలియన్‌ డాలర్లకు ఎఫ్‌ఢీఐలు!
‘‘మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన జీఎస్టీ విధానంతో దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత సాధ్యమైంది. జీఎస్టీలో సమస్యల పరిష్కారానికి జీఎస్టీ కౌన్సిల్‌ వేగంగా పనిచేస్తోంది. జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు జరిగింది. జీఎస్టీ అమలు తర్వాత నెలవారీ ఖర్చు 4శాతం ఆదా అయింది. కొత్తగా 60 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరారు. ఇప్పటిదాకా 40 కోట్లు జీఎస్టీ రిటర్న్‌లు దాఖలయ్యాయి. మా హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 284 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చెక్‌ పోస్టుల విధానానికి చెక్‌ పెట్టి కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలికాం. సఫాయీ కర్మచారి విధానానికి స్వస్తి చెప్పాం.  ’’ అని వివరించారు.   

ఫసల్‌ బీమాతో 6.11 కోట్ల మంది రైతులకు లబ్ధి
‘‘మేం ప్రవేశపెట్టిన ప్రధాని ఫసల్‌ బీమా యోజనతో 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉన్నాం. పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణంపై దృష్టిసారించాం. కృషి సించాయీ యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలను ప్రోత్సహిస్తున్నాం. గ్రామీణ సడ్‌ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పాదకత పెంచడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఉద్యాన పంటలకు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటుచేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తాం’’ అని చెప్పారు.  

పర్యాటకానికి ‘తేజస్‌’
‘‘స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా భారత్ నిలిచింది. ఓడీఎఫ్‌ ప్లస్‌ ద్వారా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.  2030 నాటికి అత్యధికంగా పనిచేయగలిగిన యువత ఉండే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రోత్సహిస్తున్నాం. మున్ముందు మరింతగా వారికి ప్రోత్సాహం అందిస్తాం. ఇప్పటికే స్మార్ట్స్‌ సిటీలు ప్రకటించాం.. రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా మరో 5 స్మార్ట్‌ సిటీలు ఏర్పాటు చేస్తాం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తేజస్‌ రైళ్లు ప్రవేశపెట్టాం. త్వరలో మరిన్ని తేజస్‌లను పట్టాలెక్కిస్తాం’’ అన్నారు.

గడపగడపకూ విద్యుత్‌ గొప్ప విజయం
‘‘దేశంలో ప్రతి గడపకూ విద్యుత్‌ తీసుకెళ్లడం మేం సాధించిన అతి పెద్ద విజయం. నేషనల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,300 కి.మీల నుంచి 27వేల కి.మీలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఫైనాన్సియల్‌ టెక్నాలజీలో సంస్కరణలకు మరిన్ని సంస్కరణలు తీసుకొస్తాం. బేటీ బచావో - బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది. ఈ పథకంతో దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఆడపిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా ప్రతిఒక్కరికీ వైద్యం అందిస్తున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి రాని ఆస్పత్రులను దాని పరిధిలోకి తీసుకొస్తాం ’’ అని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.