నీతీశ్‌ మంత్రివర్గం ఇదే!
close

తాజా వార్తలు

Published : 16/11/2020 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీతీశ్‌ మంత్రివర్గం ఇదే!

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ఏడోసారి ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం జరుగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరుకానున్నారు. నితీశ్‌తోపాటు మరో 12 మంది కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. అయితే, వీరిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ రెండు ఉపముఖ్యమంత్రి పదవులను ఈసారి భాజపాకే కేటాయించారు. వీరిలో భాజపా శాసనసభాపక్ష నేత తార్‌కిషోర్‌ ప్రసాద్‌ ఉండగా, మరో సీనియర్‌ భాజపా నేత రేణుదేవి ఉన్నారు. రేణుదేవి భాజపా తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు నీతీశ్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్‌ కుమార్‌ మోదీ స్థానంలో తార్‌కిషోర్‌ ప్రసాద్‌ డిప్యూటీ సీఎంగా నియమితులు కానున్నారు. అయితే, సుశీల్‌ కుమార్‌ మోదీని మాత్రం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నీతీశ్‌ జట్టు ఇదే..
ప్రస్తుతం 12మంది మంత్రివర్గసభ్యులతో నీతీశ్‌ కుమార్‌ ఏడోసారి ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనులు కానున్నారు. ఆయన మంత్రివర్గంలో జేడీయూ తరపున విజేంద్ర యాదవ్‌, విజయ్‌ చౌదరి, అశోక్‌ చౌదరి, మేవాలాల్‌ చౌదరి, శీలా మండల్‌లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక భాజపా నేతలు మంగళ్‌ పాండే, రాంప్రీత్‌ పాశ్వాన్‌ వంటి నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కూటమిలో ఉన్న హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా నుంచి సంతోష్‌ మాంఝీ, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ(వీఐపీ) నుంచి ముఖేష్‌ మల్లాహ్‌లకు నితీశ్‌ మంత్రివర్గంలో చోటు లభించనుంది.

ఆర్‌జేడీ దూరం..
ఈ ప్రమాణస్వీకారానికి తాము హాజరుకావడం లేదని, ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్‌ ప్రకటించింది. ప్రజాతీర్పు ఎన్‌డీఏకు వ్యతిరేకంగా రావడం వల్లే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నట్లు ఆర్‌జేడీ ట్విటర్‌లో పేర్కొంది. ప్రజాతీర్పును ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రభావితం చేసినట్లు ఆర్జేడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది.

ఇదిలాఉంటే, ఎన్‌డీఏ కూటమిలో ఉన్న భాజపా(74), జనతాదళ్‌(యునైటెడ్‌)(43), హిందుస్థానీ అవాం మోర్చా(4), వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ)(4)లు మొత్తం కలిపి 125స్థానాల్లో విజయం సాధించాయి. ఇక అత్యధిక సీట్లు ఆర్జేడీ(75) సాధించి బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహాకూటమిలో ఉన్న కాంగ్రెస్‌ 70స్థానాల్లో పోటిచేయగా కేవలం 19 స్థానాల్లోనే గెలుపొందింది. మరో 16 సీట్లను వామపక్షాలు కైవసం చేసుకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని