
తాజా వార్తలు
కరోనా: ‘ప్రపంచంతో పోలిస్తే మెరుగ్గా భారత్’
దిల్లీ: దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, దేశంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. కొన్ని చోట్ల స్థానిక వ్యాప్తి మాత్రమే ఉందని వెల్లడించింది. అదేవిధంగా ఇతర దేశాలతో పోల్చినప్పుడు కొవిడ్-19 కేసులు, మరణాల విషయంలో భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ గురువారం మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్.. కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొంటోంది. ప్రతి 10 లక్షల జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు కరోనా కేసులు, మరణాల విషయంలో మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. ప్రస్తుతం దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 538 పాజిటివ్ కేసులు వెలుగుచూస్తుండగా.. కొన్ని దేశాల్లో ఆ సంఖ్య 16-17 రెట్లు అదికంగా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు మన దేశంలో 15 మంది మరణిస్తుండగా.. కొన్ని దేశాల్లో ఈ సంఖ్య 40 రెట్లు అధికంగా ఉంది’’ అని చెప్పారు.
సగటున 2.6 లక్షల పరీక్షలు
దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త నివేదిత గుప్తా వెల్లడించారు. సగటున రోజుకు 2.6 లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాంటీజెన్ టెస్టుల ద్వారా పరీక్షల సంఖ్యను మరింత పెంచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాత్సవ పేర్కొన్నారు. దిల్లీలో ప్రస్తుతం 72 శాతం రికవరీ రేటు ఉందని చెప్పారు. డబ్లింగ్ రేటు కూడా 30కి పెరిగిందన్నారు. దిల్లీలో రోజూ 20వేల టెస్టులు చేస్తున్నారని చెప్పారు.