
తాజా వార్తలు
ఆ రెండు కంపెనీల ఫోన్లతో ఛార్జర్స్ రావు!
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ లేదా సాధారణంగా ఏ ఫోన్ కొనుగోలు చేసినా.. ఛార్జర్ తప్పనిసరిగా వినియోగదారుడికి అందించేవి పలు సంస్థలు. అయితే ఇక నుంచి ఆ రెండు కంపెనీల నుంచి వచ్చే ఫోన్లతోపాటు ఛార్జింగ్ కేబుల్ కాని.. బ్లాక్ కాని వచ్చే అవకాశం లేదని ఊహాగానాలు వస్తున్నాయి. యాపిల్ తన తర్వాత మోడల్ ఐఫోన్ 12, శామ్సంగ్ తన గెలాక్సీ ఎస్30 ఫోన్లతో ఛార్జర్లను అందించడం లేదనే వార్తలు లీకయ్యాయి. దీంతో ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయమని లేదా ఇప్పటికే ఇంట్లో అలాంటి ఏదైనా డివైస్ ఉంటే వాడుకోమని సూచించనుంది. అయితే ఇది సరైన నిర్ణయంగా పలువురు నిపుణులు అభిప్రాయడుతున్నారు.
ఇప్పటివరకు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే సగటు వినియోగదారుడి నుంచి వచ్చే అనసవరమైన ఈ-వేస్ట్‌లకు తయారీదారులు ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వచ్చేది. పనికిరాని ఉపకరణాలను స్మార్ట్ఫోన్తోపాటు పంపించడం వల్ల ఈ-వ్యర్థాలను పెంచిన వారే అవుతారే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రముఖ విశ్లేషకుడు మింగ్ చి కుయో ప్రకారం.. ఐఫోన్12లో ఉచితంగా లభించే ఇయర్ పాడ్స్ హెడ్ఫోన్లు, వైర్డ్ హెడ్సెట్, ఛార్జర్ వంటి ఏవీ ఉండబోమని పేర్కొన్నారు. ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పుకార్లు వచ్చిన తర్వాత.. శామ్సంగ్ సంస్థ కూడా 2021లో విడుదల చేయబోయే మోడళ్లకు ఇలాంటి పద్ధతినే అనుసరించాలా వద్దా అనే సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కచ్చితంగా ఏ మోడళ్లపై ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది మాత్రం వెల్లడి కాలేదు. యూరోపియన్ పార్లమెంట్ లెక్కల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 50 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. ప్రతి ఏడాది ఒక మిలియన్ టన్నుల పవర్ సప్లయిర్స్‌కు సంబంధించి పరికరాల ఉత్పత్తి జరుగుతుందని అంతర్జాతీయ టెలీ కమ్యూనికేషన్స్ యూనియన్ తెలిపింది. ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌తో తప్పనిసరిగా ఛార్జర్‌ను వినియోగదారుడికి అందిస్తున్నాయి సంస్థలు. దీంతో‘ఈ-వ్యర్థాల్లో’దాదాపు రెండు శాతం కేవలం ఛార్జర్స్ మాత్రమే స్థానం సంపాదించాయి. దీంతో ఈ-వ్యర్థాల తగ్గింపులో భాగంగా పలు సంస్థలు ఇటువైపు అడుగులు వేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.