అలిగిన అమెరికా అధ్యక్షుడు...
close

తాజా వార్తలు

Updated : 29/07/2020 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలిగిన అమెరికా అధ్యక్షుడు...

నేనంటే ఎవరికీ ఇష్టం లేదు: ట్రంప్‌

వాషింగ్టన్‌: దూకుడుగా ఉండే తన వ్యవహార శైలికి భిన్నంగా.. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ నిష్పక్షపాతంగా స్వీయ విమర్శ చేసుకున్న అరుదైన సందర్భం తాజాగా చోటుచేసుకుంది. శ్వేత సౌధంలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో... అమెరికా ప్రజలు అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కంటే తనను ఎందుకు తక్కువ ఇష్టపడుతున్నారో అని ఆయన ప్రశ్నించారు. తానంటే ఎవరికీ ఇష్టం లేదని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అంతలోనే సద్దుకుని తన వ్యక్తిత్వమే అటువంటిదని సమర్థించుకొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఫౌచీని తన ప్రభుత్వమే నియమించింది. కొవిడ్‌-19 నియంత్రణకై డాక్టర్‌ ఫౌచీ, డాక్టర్‌ బిర్క్స్‌తో సహా వైద్య నిపుణుల బృందం సూచనలనే మా ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, కరోనా విషయంలో ఫౌచీకి అమిత ప్రజాదరణ లభిస్తోంది. అసలు తనకే అత్యధిక మద్దతు రావాల్సి ఉండగా.. విమర్శలు ఎందుకు ఎదురౌతున్నాయో అర్థం కావటంలేదు. మా (ప్రభుత్వం) కోసం పనిచేసే వ్యక్తికి ప్రజాదరణ లభిస్తుండగా... నన్ను ఎవరూ ఇష్టపడకపోవడానికి నా వ్యక్తత్వమే కారణం.. అంతే! ’’ అని వాపోయారు.

అమెరికాలో కరోనా వైరస్‌ కట్టడికోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌లో ఫౌచీ సభ్యుడన్న సంగతి తెలిసిందే. అమెరికా ప్రభుత్వం, ప్రజలు కొవిడ్‌ విషయంలో ఫౌచీ సలహాలు, సూచనలను ఎంతో నమ్మకంగా పాటిస్తున్నారు. కాగా, మహమ్మారిని కట్టడి చేయటంలో విఫలమైనందుకు ట్రంప్‌ ఇటీవల విమర్శలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌కు లక్షా యాభైవేల మందికి పైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వెలువడిన ట్రంప్‌ అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశాధ్యక్షుడిని కూడా ఖాతరు చేయకుండా తన అభిప్రాయాలను నిష్పక్షపాతంగా వ్యక్తం చేయటంలో పేరుపడిన ఫాచీ వైఖరి గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ స్థానంలో ఫౌచీనే ఉండాల్సిన అవసరం లేదని.. తాము వేరే ఎవరినైనా నియమించుకోగలమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించటం కొసమెరుపు!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని