‘ప్రియ’మైన ఆటలో ‘ఎత్తు’కు
close

తాజా వార్తలు

Published : 24/12/2020 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రియ’మైన ఆటలో ‘ఎత్తు’కు

చెస్‌లో రాణిస్తున్న ప్రియాంక

ఏడేళ్లపుడు వేసవి శిక్షణ శిబిరంలో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలతో సాగుతోంది. పదేళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఆమె.. ఇప్పుడు ఆటలో ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. తన వ్యూహాలతో నిలకడగా రాణిస్తూ.. పతకాల వేట కొనసాగిస్తోంది. ఆమే.. నూతక్కి ప్రియాంక. ఇటీవల ఫిడే ఆన్‌లైన్‌ ఆసియా కాంటినెంటల్‌ జూనియర్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో కాంస్యం గెలిచిన ఈ విజయవాడ అమ్మాయి.. తాజాగా ప్రపంచ క్యాడెట్, యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌ వరకూ వెళ్లింది.

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదరంగం పావులతో కుస్తీ పట్టడం మొదలెట్టిన ప్రియాంక.. ఆటలో ఉత్తమ ప్రదర్శనతో సాగుతోంది. ఏడేళ్లపుడు తల్లి ఆమెను వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించడంతో తన చెస్‌ ప్రయాణం మొదలైంది. ఆ బోర్డు, పావులపై ఆసక్తి పెంచుకున్న తను ఆటపై పట్టు సాధించింది. అండర్‌-7 బాలికల విభాగంలో కృష్ణా జిల్లా ఛాంపియన్‌గా నిలవడంతో పాటు మరికొన్ని టోర్నీల్లో గెలవడంతో చెస్‌ తన కెరీర్‌గా మారింది. అండర్‌-9 జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. 2012లో అండర్‌-10 విభాగంలో.. ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్‌తో పాటు ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ నెగ్గి సత్తాచాటింది. ఆ తర్వాత కూడా జాతీయ, ఆసియా ఛాంపియన్‌షిప్‌ల్లో జోరు కొనసాగించింది. మొత్తంగా ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అయిదు వ్యక్తిగత స్వర్ణాలు నెగ్గింది. మూడు సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. 2016లో యుఎస్‌ టోర్నీలో టైటిల్‌ గెలిచింది. ఆ తర్వాత రెండేళ్లు కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ ఈ ఏడాది ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీల్లో వరుసగా విజయాలు సాధిస్తోంది. సుసాన్‌ పోల్గార్‌ ఫౌండేషన్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచి.. నగదు బహుమతితో పాటు రూ.44 లక్షల విలువైన వెబ్‌స్టర్‌ విశ్వవిద్యాలయ (యుఎస్‌) ఉపకార వేతనాన్ని సొంతం చేసుకుంది. చెస్‌కే తన మొదటి ప్రాధాన్యమని, ఆ విశ్వవిద్యాలయంలో చేరే విషయంపై తర్వాత ఆలోచిస్తానని ఈ మహిళా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (డబ్ల్యూఐఎమ్‌) పేర్కొంది. ప్రస్తుతం ఒక మహిళల గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎమ్‌) నార్మ్‌ కలిగిన ఉన్న ఆమె.. మరో రెండు నార్మ్‌లు సాధిస్తే ఆ హోదా సొంతం చేసుకుంటుంది. 

నిరాశ చెందా..: ఈ ఏడాది చివరి నాటికి మహిళల గ్రాండ్‌మాస్టర్‌గా నిలవాలనే లక్ష్యం పెట్టుకున్నానని, కానీ కరోనా విరామం తన ప్రణాళికలను దెబ్బతీసిందని ఆమె చెబుతోంది. ‘‘మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఈ విరామం దెబ్బతీసింది. టోర్నీలు లేకపోవడంతో నిరాశ చెందా. అయితే మిగతా ఆటలతో పోలిస్తే చెస్‌ను ఆన్‌లైన్‌లోనూ ఆడొచ్చు కాబట్టి ఇబ్బంది అనిపించడం లేదు. అయితే బోర్డుపై ముఖాముఖి తలపడడమే బాగుంటుంది. ఆన్‌లైన్‌లో ఆడుతుంటే ప్రత్యర్థులు ఎలా స్పందిస్తునారో, ఎలా ఆలోచిస్తున్నారో తెలీదు. పైగా ఇంటర్‌నెట్‌ సమస్య భయపెడుతుంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే కోచ్‌ స్వయమ్‌ మిశ్రా దగ్గర శిక్షణ తీసుకుంటున్నా’’ అని 18 ఏళ్ల ప్రియాంక తెలిపింది.

ఇబ్బంది ఉన్నప్పటికీ..: గత రెండేళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రియాంక చెప్పింది. ‘‘గత రెండేళ్లు బాగా కష్టపడ్డప్పటికీ ఫలితాలు రాకపోవడంతో బాధపడ్డా. కానీ ప్రయత్నం ఆపలేదు. ఒక డబ్ల్యూఐఎమ్‌ నార్మ్‌ వచ్చాక అన్ని అనుకూలంగా మారిపోయాయి. విజయాలు మొదలయ్యాయి. ఆర్థికంగానూ సమస్యలు ఉన్నప్పటికీ మా నాన్న రాధాకృష్ణ, అమ్మ దుర్గాదేవి నన్ను ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. స్పాన్సర్‌ అంటూ ఎవరూ లేరు. సొంత ఖర్చులతోనే విదేశాల్లో టోర్నీలకు వెళ్లాల్సి వస్తోంది. నాన్న చిన్న వ్యాపారం చేస్తూ నన్ను నడిపిస్తున్నాడు. చెస్‌లో నాకు క్లాసికల్‌ విభాగం ఇష్టం. ప్రపంచ మహిళల చెస్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎదిగిన జుడిత్‌ పోల్గర్‌ను అభిమానిస్తా. ఆనంద్, హంపి అంటే ఎంతో గౌరవం. నా జీవిత లక్ష్యం గ్రాండ్‌ మాస్టర్‌ హోదా సాధించి మహిళల ప్రపంచ ఛాంపియన్‌ కావడం. అంతకంటే ముందు మహిళల గ్రాండ్‌మాస్టర్‌ అవ్వాలి’’ అని 2263 ఎలో రేటింగ్‌ పాయింట్లు కలిగి ఉన్న ప్రియాంక పేర్కొంది.

ఇవీ చదవండి..

రెండో టెస్టుకూ వార్నర్‌ దూరం

స్టాండ్‌కు నా పేరు తీసేయండి

రాహుల్‌కు చోటు లేదా?


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని