
తాజా వార్తలు
హాట్‌స్పాట్ నుంచి కరోనా కట్టడి దిశగా..
ముంబయి: దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కేసుల పెరుగుదల కలవరపెడుతుండగా, గత వారం రోజులుగా ధారావి ప్రాంతంలో కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. గత నెలలో ఈ ప్రాంతం కరోనా హాట్‌స్పాట్‌గా ఉందని, కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలతో కరోనా సూచీని కిందికి దించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 1,900 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వారిలో 939 మంది కోలుకున్నట్లు తెలిపారు.
‘‘గత ఆరు రోజుల్లో ధారావిలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. కరోనా నియంత్రణలో మేం సరైన పద్ధతిని అవలంబిస్తున్నాం అనేందుకు ఈ గణాంకాలే ప్రామాణికం. అలానే కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. జూన్ 1 తేదీన ధారావిలో 34 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం కేవలం 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఫీవర్ క్లినిక్స్ సహాయంతో కరోనా లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించగలిగాం. వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా ఐసోలేషన్‌కు తరలించాం’’ అని బీఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, నార్త్ వార్డ్, కిరణ్ దిగావ్కర్ తెలిపారు.
ముంబయిలో ఇప్పటివరకు 48,000 కరోనా కేసులు నమోదవ్వగా, సుమారు 1,600 మంది మృతిచెందారు. 85,975 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర కరోనా కేసుల నమోదులో చైనాను దాటేసింది. వీరిలో 3,060 మంది మరణించారు. అలానే 39,314 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు.