close
Array ( ) 1

తాజా వార్తలు

మార్కెట్లను ముంచిన లాక్‌డౌన్‌ 4.0

ఉద్దీపనలు, లాక్‌డౌన్‌ పొడిగింపు రుచించలేదు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. చరిత్రలో సూచీలకు మరో బ్లాక్‌ మండే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు ఆశాజనంగా లేకపోవడం, లాక్‌డౌన్‌ 4.0, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, ఏడాది పాటు దివాలా స్మృతి మినహాయింపు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,068.75 పాయింట్లు నష్టపోయి, 300028.98వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 313.60 పాయింట్ల నష్టంతో 8,823 స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.90 వద్ద కొనసాగుతోంది.

ఈ రోజు ఉదయం స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 740 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. దీంతో చివరకు మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సిప్లా, టీసీఎస్‌, భారతీ ఇన్‌ప్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ తదితర షేర్లు లాభపడగా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌, ఐషర్‌ మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంకు తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

‘‘కరోనా వైరస్‌ కట్టడికి, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని మదుపరులు భావించారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేవీ మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకూ పొడిగించారు.  లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఇందువల్ల చెల్లింపులు జరపలేకపోతే దివాలా స్మృతి నుంచి ఏడాది పాటు మినహాయింపు ఇస్తున్నట్లు ఆదివారం ఆర్థిక మంత్రి ప్రకటించడం రుచించలేదు. దీని వల్ల బ్యాంకులకు నిరర్థక ఆస్తులు పెరిపోతాయన్న ఆందోళన వ్యక్తమవడంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది’’ అని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయడ్డారు.

మార్కెట్‌ పతనాన్ని శాసించిన అంశాలు

ఉసూరుమనిపించిన ఉద్దీపనలు

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీని అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ మే 12న ప్రకటించారు. మోదీ ప్రకటనతో మరుసటి రోజు మార్కెట్లు మురిశాయి. ఆ తర్వాత 20లక్షల కోట్ల ప్యాకేజీ గురించి ఒక్కొక్కటిగా  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ వెల్లడించిన ఏవీ మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. ఆరోజు నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు, ప్రోత్సాహకాలు దీర్ఘకాలంలో మేలు చేస్తాయి కానీ, ప్రస్తుతం వాటి ప్రభావం అంతగా ఉండదని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఫైనాన్షియల్ స్టాక్‌లను దెబ్బతీసిన దివాలా స్మృతి

అన్నింటితో పోలిస్తే, ఆదివారం ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ఫైనాన్షియల్‌ స్టాక్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కంపెనీలకు సత్వరం ఊరటనిచ్చేలా ఇందులో చర్యలు ప్రకటించిన నిర్మలా సీతారామన్‌ చెల్లింపులు జరపలేకపోతే దివాలా స్మృతి నుంచి ఏడాది పాటు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.  కంపెనీల చట్టం-2013లో సవరణలు తీసుకురావడం ద్వారా ఇప్పటివరకు నేరపూరితంగా పరిగణిస్తున్న కొన్ని అంశాలను తొలగిస్తామని, దీంతో కంపెనీలకు తక్షణం ఊరట కలుగుతుందన్నారు. ఈ నిర్ణయాలు ఫైనాన్షియల్‌ స్టాక్స్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పటికే నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్న బ్యాంకులకు ఈ నిర్ణయం శరాఘాతంలా తగిలింది.

లాక్‌డౌన్‌ 4.0

మే 18వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ 4.0 ప్రారంభమైంది. దాదాపు 55రోజుల పాటు సాగిన కఠిన లాక్‌డౌన్‌ కొన్ని ఆంక్షల మేరకు సడలించారు. ఎక్కువ అంశాలపై నిర్ణయాధికారాలను రాష్ట్రాలకు వదిలేశారు. కొన్ని ఆంక్షలు సడలించినా దేశవ్యాప్తంగా పరిస్థితి అదుపులో లేదు. ఆర్థిక కష్టాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అవన్నీ ఎప్పుడు సద్దుమణుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది.

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా బారినపడ్డ వారి సంఖ్య లక్షకు చేరువగా ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 5242 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 96,168కి చేరింది. ఇక మృతుల సంఖ్య 3,029లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, దిల్లీలలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇవన్నీ మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.