close

తాజా వార్తలు

Published : 01/11/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీరు చెప్పిందే నిజమైతే వలసలు ఎందుకు?

మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్‌, ఆర్జేడీ

పట్నా: బిహార్‌లో జేడీయూ-భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంగా పేర్కొంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన నిమిషాల్లోనే ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌ విమర్శలు ప్రారంభించాయి. ఇవాళ ఉదయం చాప్రాలో మోదీ మాట్లాడుతూ.. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ చెప్పినట్లుగా మాది డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే.. అదే రాష్ట్రాభివృద్ధికోసం పాటుపడుతోందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై  కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా స్పందించారు. ‘‘ గౌరవనీయులైన ప్రధాని గారూ.. 2015 ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌కు 18వ శాతాబ్దపు ఆలోచనలు ఉన్నాయని మీరే చెప్పారు. ఇప్పుడు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అంటున్నారు. దీనిని బట్టి ఇది  ‘‘డబుల్‌ మోసం’’ అని ప్రజలు గ్రహిస్తున్నారు. ఒకరు అబద్ధాలు చెబుతున్నారు. మరొకరు మోసం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీ ఇద్దరికీ బుద్ధిచెబుతారు’’ అని సూర్జేవాలా ట్విటర్‌లో పోస్టు చేశారు.

మోదీ మాటలపై  ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు చెప్పినట్లు మీది డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే అయితే బిహార్‌లో నిరుద్యోగం 46.6 శాతం ఎందుకుంది’’ అని ప్రశ్నించారు. వలసలు పెరిగిపోవడానికి కారణమేంటన్నారు. ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో నేరాల శాతం ఎందుకు పెరిగిపోతోందని విమర్శించారు.  రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాల్లోనూ రాష్ట్రం వెనుకబడే ఉందని నీతిఆయోగ్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సొంత నియోజకవర్గం చాప్రాలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా  రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లను యువరాజులుగా పేర్కొంటూ అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడు నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు బిహార్‌లోనూ అదే పునరావృతం కానుందని మహాగట్‌బంధన్‌ను ఉద్దేశించి అన్నారు. మొత్తం 243 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనుండగా.. గత నెల 28న తొలి విడత పోలింగ్‌ ముగిసింది. మంగళవారం రెండో విడత పోలింగ్‌ జరగనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన