‘మోదీ-షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు’
close

తాజా వార్తలు

Published : 13/06/2020 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మోదీ-షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు’

 భాజపాపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ తీవ్ర విమర్శలు

జైపుర్‌: ఓవైపు యావత్తు దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పనిలో ఉన్నారని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా అనేక ప్రయత్నాలు చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అనేక మంది కాంగ్రెస్‌, స్వతంత్ర ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం జైపుర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే తమ ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభాలకు గురిచేస్తోందని గహ్లోత్‌ ఆరోపించారు. ప్రపంచమంతా వైరస్‌తో పోరాడుతున్న సమయంలోనూ.. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సర్కార్‌ను భాజపా కూల్చిందంటూ ఆరోపణలు గుప్పించారు. ‘‘ఎవరు నొప్పిని పంచుతున్నారో.. ఎవరు ఔషధాలు పంచుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

రెండు నెలల క్రితమే రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఈ సందర్భంగా గహ్లోత్‌ గుర్తుచేశారు. కానీ, ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ పూర్తికాకపోవడంతో భాజపా వాయిదా వేయించిందని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు ఓటు వేయబోరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ తరఫున ఇద్దరు అభ్యర్థులు గెలిచి తీరతారన్నారు. ఇద్దరు సీపీఐ-ఎం ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌కే మద్దతుగా ఉన్నారని తెలిపారు. 

జూన్‌ 19న రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది బీఎస్పీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌ బలం 107కు చేరింది. 12 మంది స్వతంత్రులు కూడా గహ్లోత్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. భాజపాకు 72 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ సీటు గెలవడానికి ఒక్కో అభ్యర్థికి 51 మొదటి ప్రాధన్యతా ఓట్లు రావాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ రెండు, భాజపా ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ, భాజపా ఇద్దరు అభ్యర్థుల్ని బరిలో నిలపడంతో రాజకీయం వేడెక్కింది. తమ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు భాజపా యత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను ఓ రిసార్టుకు తరలించింది. ప్రస్తుతం సీఎం గహ్లోత్‌ సహా ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ సైతం అక్కడే ఉన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని