
తాజా వార్తలు
దుబ్బాకలో ప్రారంభమైన పోలింగ్
దుబ్బాక: దివంగత తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. నియోజక వర్గ పరిధిలో 315 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ఉన్నతాధికారులు ఓటర్లకు ఇది వరకే విజ్ఞప్తి చేశారు.. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెరాస నుంచి సుజాత రామలింగారెడ్డి, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రధానంగా తెరాస, భాజపా నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం సాగించారు. సవాళ్లు, విమర్శలతో రాజకీయ వేడి పెంచారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీ కేడర్ సాయంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎవరు గెలుస్తారు? ఎంత ఆధిక్యం వస్తుందనే అంశమై అంతటా చర్చలు సాగుతున్నాయి. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.