
తాజా వార్తలు
రోహిత్‌కు పగ్గాలిస్తే కోహ్లీపై భారం తగ్గుతుంది
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా ఓపెనర్, ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు పొట్టి ఫార్మాట్ బాధ్యతలు అప్పగిస్తే విరాట్ కోహ్లీపై భారం తగ్గుతుందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. పార్థివ్ బుధవారమే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు ఓ క్రీడా సంస్థతో మాట్లాడుతూ రోహిత్, కోహ్లీ కెప్టెన్సీలపై స్పందించాడు. హిట్‌మ్యాన్ పూర్తి ఫిట్నెస్తో ఉండి మ్యాచ్‌లు ఆడుతుంటే.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు జట్టు బాధ్యతలు అతడికి అప్పగించడం మంచిదని చెప్పాడు. అందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.
జట్టును ఎలా నిర్మించాలో అతడికి బాగా తెలుసని, టోర్నమెంట్లు ఎలా గెలవాలో కూడా చూపించాడని పార్థివ్ వివరించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్ఇండియా టీ20 ఫార్మాట్ బాధ్యతలను అతడికి అప్పగిస్తే ఎలాంటి ప్రమాదం లేదని అభిప్రాయపడ్డాడు. అలా చేస్తే విరాట్ కోహ్లీపై ఉన్న భారం తగ్గుతుందని తెలిపాడు. రోహిత్‌తో కలిసి చాలా టోర్నీలు గెలిచామని, ఒత్తిడిలో అతడు తీసుకునే నిర్ణయాలు ఆసక్తిగా ఉంటాయని చెప్పాడు. అలాగే ముంబయి ఇండియన్స్ ఎప్పుడూ సరైన జట్టు కాదని, అలాంటి ఆటగాళ్లందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఫలితాలు ఎలా సాధించాలో రోహిత్ చూపించాడని చెప్పాడు. భారత జట్టు కెప్టెన్సీ విషయంలో రోహిత్, కోహ్లీలకు అవకాశం ఉందని, ఐపీఎల్ వల్లే అది సాధ్యమైందని పార్థివ్ అన్నాడు. కాగా, గతనెల ముంబయి ఐదోసారి ఐపీఎల్ విజేతగా నిలవడంతో టీమ్ఇండియా పొట్టి ఫార్మాట్ పగ్గాలు రోహిత్‌కు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే పార్థివ్ సైతం తన అభిప్రాయం వెల్లడించాడు.
ఇవీ చదవండి..