close
Array ( ) 1

తాజా వార్తలు

పార్టీ నిర్ణయమే అంతిమం

 

  టికెట్లు రాని వారు నిరాశపడొద్దు
   వారికి పార్టీ, కార్పొరేషన్‌ పదవులిస్తాం తిరుగుబాట్లను సహించం
  వినకపోతే బహిష్కరణ వేటే
  ఛైర్మన్‌, మేయర్‌ పదవులన్నీ మనవే
  తెరాస ఎమ్మెల్యేల సమావేశంలో కేసీఆర్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాసకే రాష్ట్రమంతా అనుకూలంగా ఉంది. ఛైర్‌పర్సన్‌, మేయర్‌ పదవులన్నీ గెలుచుకుంటాం. ఎన్నికల్లో ఎమ్మెల్యేలే కర్త, కర్మ, క్రియలుగా వ్యవహరించాలి. టికెట్లు రాని వారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత వారిదే.

- తెరాస అధినేత  కేసీఆర్‌

 

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక, నగరపాలక ఎన్నికల్లో పార్టీ తరఫున ఎంపిక చేసిన అభ్యర్థులే బరిలో ఉండాలి. టికెట్లు రాని వారు నిరాశ పడొద్దు.. తెరాస మరో 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటుంది.. భవిష్యత్తులో అందరికి పార్టీ, నియమిత పదవులు, ఇతర అవకాశాలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా నామినేషన్లు వేస్తే వారిని పిలిచి మాట్లాడాలని, బుజ్జగించి విరమింపజేయాలని నేతలకు సూచించారు. మాట వినని వారిపై బహిష్కరణ వేటు వేస్తామని, వారిని మళ్లీ పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో ఆయన సమావేశమయ్యారు. మంత్రులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘పురపాలక ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చాం. 75 గజాల్లోపు స్థలాల్లో అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశమిచ్చాం. వీటన్నింటిని ఇంటింటికీ తెలియజేయాలి. ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పడతారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఉంది.  పురపాలక ఎన్నికల్లో టికెట్లు రాలేదని పార్టీ కార్యకర్తలు బాధపడొద్దు. ఓపిక, సహనంతో ఉన్న వారికి వాటంతట అవే పదవులొస్తాయి. తొందరపాటుతో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించవద్దు. క్రమశిక్షణను పాటించని వారిపై కఠినంగా ఉంటామనే సంకేతాలివ్వాలి. పార్టీ అన్నాక నేతల మధ్య విభేదాలు సహజం. అంతా సర్దుకు పోవాలి. గోరంతను కొండంతగా చూపి దుష్ప్రచారం చేస్తారు. అంతా అప్రమత్తంగా ఉండాలి.  ఎన్నికల తర్వాత నాలుగేళ్ల వరకు ఏ ఎన్నికలు లేవు. పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి విజయవంతంగా సాగుతోంది. కొత్త పురపాలక చట్టం ప్రజలకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. పకడ్బందీగా దాన్ని అమలు చేస్తాం.

కేటీఆర్‌కు ప్రచార బాధ్యతలు
నామినేషన్‌ పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విధి విధానాలను పాటించాలి. ఏమరుపాటు, నిర్లక్ష్యం వద్దు. ఎన్నికల పత్రాల దాఖలులో న్యాయవాదుల సహాయం తీసుకోవాలి. పురపాలక ఎన్నికల ఖర్చుల విషయంలోనూ నిబంధనలు అమలు చేయాలి. ఎన్నికల సరళిని పార్టీ పరిశీలిస్తుంది. తెలంగాణ భవన్‌ నుంచి పర్యవేక్షణ సాగుతుంది. ప్రచారం పెద్ద ఎత్తున సాగాలి. ప్రచార బాధ్యతలను కేటీఆర్‌ నిర్వహిస్తారు.’’ అని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఎమ్మెల్యేలకు పార్టీ ఏ, బీ-ఫారాలను అందజేశారు.

ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం
ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఉదయం పది గంటలకే తెలంగాణభవన్‌ వచ్చారు. ఆ తర్వాత నిర్ణీత షెడ్యూలు ప్రకారం కేసీఆర్‌ పదిన్నరకు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, పద్మా దేవేందర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, భూపాల్‌ రెడ్డి, మనోహర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డితో పాటు మరికొందరు ఆలస్యంగా వచ్చారు. వారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తర్వాత సమావేశానికి వస్తే ఎలా అని ప్రశ్నించారు. సమయపాలన పాటించాలని సూచించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు జ్వరంతోనే సమావేశానికి రాగా వారిని సీఎం పరామర్శించారు.

సమావేశం నుంచి దిల్లీకి కేటీఆర్‌
ఆరంభం నుంచి దాదాపు గంట సేపు సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌ బీ-ఫారాల పంపిణీ తర్వాత దిల్లీలో జరిగే విహాంగభారత్‌ సమావేశంలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు.


ఆచితూచి బి-ఫారాల పంపిణీ!
ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక, నగరపాలక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు ఆచితూచి బి-ఫారాల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది. బి-ఫారాల పంపిణీకి ఈనెల 14 వరకు అవకాశం ఉన్నందున దానిని ఉపయోగించుకోవాలని వెల్లడించినట్లు సమాచారం. నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగుస్తోంది. నిబంధనల ప్రకారం 14 వరకు అభ్యర్థులకు పార్టీ తరఫున ధ్రువీకరణ పత్రమైన బి-ఫారం సమర్పించేందుకు గడువు ఉంది. అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేని చోట వెంటనే బి-ఫారాలు ఇవ్వాలని.. సమస్యలుంటే 14 వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.