close

తాజా వార్తలు

Published : 13/09/2020 11:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో లోపాలున్నాయి’

ప్రయోగాల నిలిపివేతపై రష్యా స్పందన
తమ స్పుత్నివ్‌-Vనే సురక్షితమైందని వ్యాఖ్య

మాస్కో: ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోవడంపై రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్‌ అభివృద్ధికి అవలంబిస్తున్న విధానంలో లోపాల్ని ఈ చర్య ఎత్తిచూపిందని ఆ సంస్థ సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్‌ అభిప్రాయపడ్డారు. విస్తృత స్థాయిలో ఉపయోగించాల్సిన ఓ వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ఆయా దేశాలు సరికొత్త, గతంలో పరీక్షించని విధానాల్ని ఉపయోగిస్తున్నాయన్నారు. కోతుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వాడడం, ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను వినియోగించడం కొత్త విధానాలని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తిరిగి ప్రారంభం కావడంపై ఆర్‌డీఐఎఫ్‌ సంతోషం వ్యక్తం చేసింది. 

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ మాత్రం అందుకు భిన్నమన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మానవుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వినియోగించామన్నారు. అందువల్లే స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమైందన్నారు. 2020-21లో 100 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్‌ను అందజేయనున్నట్లు రష్యాకు చెందిన ఇంటర్‌ఫ్యాక్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇప్పటికే ఆర్‌డీఐఎఫ్‌ దీని ఎగుమతికి రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు బ్రెజిల్‌లోని బహియా రాష్ట్రం ఈ వ్యాక్సిన్‌తో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు అంగీకరించింది. 

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలకు బ్రేక్‌ పడడంతో ఫార్మా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకవేళ తయారీ నిలిచిపోతే.. టీకా కొనుగోలుకు ముందుకు వచ్చిన దేశాలు సంస్థలకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ వినిపించింది. దీనిపై స్పందించిన ఆర్‌డీఐఎఫ్‌.. రష్యా అలాంటి విధానాన్ని అవలంబించబోదన్నారు. స్పుత్నిక్‌-Vతో సహా తమ వ్యాక్సిన్లన్నీ అత్యంత సురక్షితమైనవని నిరూపితమైందన్నారు. 

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు శనివారం పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. కొందరికి ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్‌ ఇవ్వగా అందులో ఒకరికి అస్వస్థత లక్షణాలు కనిపించాయి. దాంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. అయితే ఇంతవరకు జరిగిన ప్రక్రియ అంతా సురక్షితమేనని జౌషధ ఆరోగ్య నియంత్రణ సంస్థ ధ్రువీకరించడంతో మళ్లీ ప్రయోగాలను ప్రారంభించారు. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి వచ్చాక ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లో ప్రయోగాలను తిరిగి ప్రారంభిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని