ఆ బాధ్యత తెరాస ప్రభుత్వంపై ఉంది: పవన్‌
close

తాజా వార్తలు

Published : 24/10/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ బాధ్యత తెరాస ప్రభుత్వంపై ఉంది: పవన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌‌: నీటి వనరులను పరిరక్షించే జీవో 111కు తూట్లు పొడిచే ప్రయత్నాల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను ప్రజాప్రతినిధులు బలోపేతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థకు తూట్లు పొడిచి వెళ్లిపోతే చాలా సమస్యలు వస్తాయన్నారు. నాలాలు ఆక్రమించి వాటిపై అక్రమ నిర్మాణాలు చేపడితే భారీ వర్షాలు, వరదల సమయంలో ఎన్నో ఇబ్బందులు తప్పవన్నారు. అర్బన్ ప్లానింగ్, జీవో 111 అమలు ఆవశ్యకత, నిబంధనలు అమలులో నేతల జోక్యం తదితర అంశాలపై జనసేన సోషల్‌ మీడియాతో పవన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రతిపక్షంలో మాట్లాడినంత బలంగా..

‘‘భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. నదులు, చెరువులు, కుంటలను ఆక్రమించి అమ్మేశారు. ఇలా నదులు, చెరువులు అమ్మేసిన విధానాన్ని నిలువరించి అక్రమ కట్టడాలు తీసేస్తే బాగుండేది. మన దేశంలో అర్బన్ ప్లానింగ్ వ్యవస్థకు తూట్లు పొడవడం అనవాయితీగా మారింది. నాలాలు, చెరువుల దురాక్రమణపై ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాట్లాడినంత బలంగా అధికారంలోకి రాగానే మాట్లాడలేకపోతున్నారు.. సన్నాయి నొక్కులు నొక్కుతారు. అధికారంలోకి వచ్చాక పరిస్థితులు వేరుగా ఉంటాయేమో? అధికారంలో లేం కాబట్టి తెలియదు. అందుకే మాట్లాడేటప్పుడు 360 డిగ్రీల కోణంలో ఆలోచించి మాట్లాడతాను. గతం నుంచి ఉన్న ప్రభుత్వాలు అర్బన్ ప్లానింగ్‌కు తూట్లు పొడుస్తూ వచ్చాయి. గతంలో హైదరాబాద్‌ పరిధిలో 700 నుంచి 800 వరకూ చెరువులు ఉండేవని చెబుతారు. ఇప్పుడు 180 మాత్రమే ఉన్నాయి. అవి కూడా విస్తీర్ణం తగ్గిపోయి కాలుష్యంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. గండిపేట చెరువు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. కాలుష్యంపై నిర్లక్ష్యంగా ఉంటూ కాలుష్య నియంత్రణ చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి. ఇప్పటికైనా మేల్కొనాలి. 

జీవో 111 అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి

నీటివనరులను పరిరక్షించేందుకే జీవో 111 తీసుకువచ్చారు. దీనికి 2009 నుంచి తూట్లు పొడవాలని చాలా ప్రయత్నాలు  చేస్తున్నారు. నాలాలు, ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉన్న స్థలాలు ఆక్రమించడం, ఇళ్ల నిర్మాణం చేపట్టడం.. అనుమతులు ఇవ్వడం చేస్తున్నారు. మళ్లీ వాటిని కొంత డబ్బు కట్టించుకొని క్రమబద్ధీకరణ చేస్తున్నారు. తప్పు చేసేయవచ్చు.. ఆ తరవాత డబ్బు కట్టేసి రెగ్యులరైజ్ చేయించుకోండి అనే ధోరణే ఇప్పటి పరిస్థితికి దారి తీసింది. దీనికి ఈ ప్రభుత్వాన్నే అనలేం కానీ గత ప్రభుత్వాల నుంచి తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న తెరాస ప్రభుత్వానికి ఆ తప్పులను సరిచేసే బాధ్యత ఉంది. ఈ విషయంలో ఎంత వరకూ సఫలీకృతులు అవుతారో తెలీదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జీవో 111 అమలుపై దృష్టిపెట్టాలి. లేకపోతే ఇవాళ జరిగిన నష్టం మరో 20 ఏళ్ల తర్వాత ఇబ్బంది ముబ్బడిగా జరుగుతుంది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే జీవో 111ను బలంగా అమలు చేయాలి.

ఎవర్నీ ఉపేక్షించకూడదు.. 

అధికారమే పరమావధిగా కాకుండా సామాజిక మార్పు, పాలసీలపై బలంగా నిలబడాలనే ఆలోచన రాజకీయ పార్టీల్లో ఉండాలి. అధికారంలో ఉంటే అన్ని సాధించవచ్చు అనుకోవడం భ్రమ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆనాడు అధికారంలో లేని ఒక రాజకీయ పార్టీ. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధులు కలిసి పోరాడాలి. సిటీ ప్లానింగ్‌లో అక్రమాలకు తావివ్వకూడదు అనేది కామన్ మినిమమ్ ప్రోగ్రాం కావాలి. అధికారులు కూడా టౌన్ ప్లానింగ్ విషయంలో చాలా స్పష్టతతో వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించకూడదు. నివాసాల కోసం ఉద్దేశించిన ప్రాంతంలో కమర్షియల్ బిల్డింగులు కట్టకూడదని ఉంటుంది.. కానీ కడతారు. అధికారులు వెళ్లి అడిగితే ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అంటుంటారు. ఎవర్నీ ఉపేక్షించకూడదు. ప్రతి ఒక్కరికీ చట్టపరమైన నిబంధనలను సమానంగా వర్తించేలా చేయాలి. అది 50 చదరపు అడుగుల నిర్మాణం కావచ్చు.. ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణం కావచ్చు. ముఖ్యంగా అధికారులు తమ నిర్ణయాలను భయపడకుండా బలంగా అమలు చేయాలి. ప్రజా ప్రతినిధులు అక్రమాలను వెనకేసుకుని రాకూడదు. రూ.కోట్లు పెట్టి కొన్న విల్లాలు కూడా ఇలాంటి విపత్తులు వస్తే మునిగిపోతాయి. అప్పుడెవరో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగమో చేసిన తప్పులకు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాం. ఇక్కడ నిబంధనల మేరకు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కుదరదు అని అధికారులు చెబితే ప్రత్యామ్నాయం వెతుక్కొంటారు. మనకు బలమైన పౌర సమాజం అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థతోపాటు అలాంటి పౌర సమాజం ఉంటే తప్ప ఇలాంటి దురాక్రమణలు ఆగవు. జనసేన పార్టీని స్థాపించింది కూడా బలమైన పౌర సమాజం ఉండాలనే’’ అని పవన్‌ చెప్పారు.

దసరా సందర్భంగా ప్రజలందరికీ పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి, విపత్తులు, కష్టాల నుంచి అందర్నీ అమ్మవారు కాపాడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని