
తాజా వార్తలు
2024 కంటే ముందే ఎన్నికలు: పవన్
మంగళగిరి: దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నందున 2024 కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన క్రియాశీల సభ్యత్వం, భవిష్యత్ కార్యాచరణపై 32 నియోజకవర్గాల నేతలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేనాని సమావేశమయ్యారు. జమిలి ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని.. ఈలోగా పార్టీలోని క్రియాశీల సభ్యులు 50 నుంచి 100 మందిని ప్రభావితం చేసేలా సన్నద్ధం కావాలని సూచించారు. పార్టీకి జనబలం ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం లేకపోవడం ఇబ్బందిగా మారిందని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ నాయకులు బలోపేతం కావాలని సూచించారు. ఎంత మంది ఒత్తిడి చేసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజల పక్షాన నిలబడింది జనసైనికులేనని.. వారికి ఇబ్బంది కలిగేలా నాయకులు ప్రవర్తించరాదని స్పష్టం చేశారు.
ఇతర పార్టీల నుంచి జనసేనలోకి వచ్చే వారి విషయంలో పార్టీ శ్రేణుల అభిప్రాయానికి విలువ ఇవ్వాలని పవన్ సూచించారు. ఎవరికైనా పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే నిర్మొహమాటంగా బయటకు వెళ్లిపోవచ్చన్నారు. ఒక్కరు వెళ్తే వంద మందిని పార్టీలోకి తీసుకువస్తానని పవన్ ధీమా వ్యక్తం చేశారు. జనసైనికులంతా కలిసి ప్రణాళికాబద్ధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మరో రెండు వారాల్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఇసుక పాలసీ, మద్యం విధానం, రైతు సమస్యలు, పోలవరం ప్రాజెక్టు అంశాలపై ఆ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు.